Meghan Markle : కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి కోడలు మేఘన్ ఎందుకు రాలేదంటే ?

బ్రిటన్ రాజుగా 74 ఏళ్ళ కింగ్ చార్లెస్ (King Charles) పట్టాభిషేక వేడుకకు 100 మంది దేశాధినేతలు, ప్రపంచ ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే ఆయన చిన్న కోడలు, ప్రిన్స్ హ్యారీ (Prince Harry) భార్య మేఘన్ మెర్కెల్ (Meghan Markle) హాజరు కావడం లేదు .

  • Written By:
  • Publish Date - May 6, 2023 / 11:53 AM IST

లండన్: బ్రిటన్ రాజుగా 74 ఏళ్ళ కింగ్ చార్లెస్ (King Charles) పట్టాభిషేక వేడుకకు 100 మంది దేశాధినేతలు, ప్రపంచ ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే ఆయన చిన్న కోడలు, ప్రిన్స్ హ్యారీ (Prince Harry) భార్య మేఘన్ మెర్కెల్ (Meghan Markle) హాజరు కావడం లేదు . దీంతో ఇంతకీ ఆమె ఎందుకు ఈ ప్రోగ్రాం కు రావడం లేదు ? అనే దానిపై బ్రిటన్ లో హాట్ డిబేట్ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే .. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ 2020లో బ్రిటన్ రాజ కుటుంబం బాధ్యతలను విడిచిపెట్టి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లి ఫ్యామిలీతో స్థిరపడ్డారు. బ్రిటన్ రాజ కుటుంబం అంతర్గత వ్యవహారాలపై ప్రిన్స్ హ్యారీ “Spare” పేరుతో పుస్తకాన్ని రాసి రిలీజ్ కూడా చేశారు. ఈ బుక్ లో తన తల్లి డయానా గురించి గుర్తు చేసుకొని ప్రిన్స్ హ్యారీ ఎమోషనల్ అయ్యారు. అమ్మ డయానా చనిపోయిన తర్వాత రాజ కుటుంబం సంప్రదాయం ప్రకారం తనను కనీసం ఏడవనివ్వలేదని వాపోయారు. రాజ కుటుంబంపై తనకున్న వ్యతిరేకతను ఆ బుక్ లో వెళ్లగక్కారు. తన తండ్రి చార్లెస్, పినతల్లి కెమిల్లాలకు జరిగే పట్టాభిషేక మహోత్సవం కోసం ఇప్పటికే హ్యారీ లండన్ కు చేరుకున్నాడు. కానీ ఆయనతో భార్య మేఘన్ మెర్కెల్ (Meghan Markle), ఇద్దరు పిల్లలు ప్రిన్స్ ఆర్చీ , ప్రిన్సెస్ లిలిబెట్ రాకపోవడంపై ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. వేడుకలో పాల్గొనేందుకు హ్యారీ ఒక్కరే వచ్చారని బకింగ్‌హామ్ ప్యాలెస్ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రిన్స్ ఆర్చీ, ప్రిన్సెస్ లిలిబెట్‌లతో కలిసి మేఘన్ మెర్కెల్ కాలిఫోర్నియాలోనే ఉన్నారని వెల్లడించింది.

ALSO READ : King Charles III coronation : కింగ్ చార్లెస్ పట్టాభిషేకంలో పాల్గొనే ఇండియన్స్ వీళ్ళే

ప్రిన్స్ హ్యారీ ఆ ప్రోగ్రామ్స్ లో పాల్గొనరట..

ప్రిన్స్ హ్యారీ పెద్ద కుమారుడు నాలుగేళ్ల ప్రిన్స్ ఆర్చీ బ్రిటన్ రాజ సింహాసనానికి ఆరో వరుసలో ఉన్నారు. తండ్రి కింగ్ చార్లెస్, సోదరుడు ప్రిన్స్ విలియంలతో ఉన్న అభిప్రాయబేధాల నేపథ్యంలోనే హ్యారీ భార్య మేఘన్ పట్టాభిషేక వేడుకకు రాలేదని అంటున్నారు. తండ్రి పట్టాభిషేక వేడుక సందర్భంగా నిర్వహించే ఊరేగింపులో హ్యారీ పాల్గొనడని తెలుస్తోంది. ఇతర అధికారిక కార్యక్రమాలలో కూడా ఆయన పాల్గొనరని సమాచారం. శనివారం పట్టాభిషేక వేడుక పూర్తయిన తర్వాత బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీలో కుటుంబ సమేతంగా నిలబడి ప్రేక్షకులకు అభివాదం చేసే సంప్రదాయం ఉంది. ఈ ప్రోగ్రాంకు సైతం దూరంగా ఉండాలని ప్రిన్స్ హ్యారీ డిసైడ్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. గతంలోకి వెళితే.. గత సంవత్సరం సెప్టెంబర్‌లో తన అమ్మమ్మ క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియల సందర్భంగా చార్లెస్, విలియమ్‌లతో కలిసి హ్యారీ కనిపించాడు.