Tharman Shanmugaratnam: సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన వ్యక్తి.. రేపే ప్రమాణ స్వీకారం, ఎవరీ ధర్మన్ షణ్ముగరత్నం..?

సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త ధర్మన్ షణ్ముగరత్నం (Tharman Shanmugaratnam) గెలుపొందారు. ఆయన సింగపూర్ 9వ అధ్యక్షుడిగా గురువారం (సెప్టెంబర్ 14) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 06:54 AM IST

Tharman Shanmugaratnam: సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త ధర్మన్ షణ్ముగరత్నం (Tharman Shanmugaratnam) గెలుపొందారు. ఆయన సింగపూర్ 9వ అధ్యక్షుడిగా గురువారం (సెప్టెంబర్ 14) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల షణ్ముగరత్నం 70.4 శాతం ఓట్లతో పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. వాస్తవానికి అధ్యక్షురాలు హలీమా యాకోబ్ పదవీకాలం సెప్టెంబర్ 13తో ముగియనుంది. భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం సెప్టెంబర్ 14 నుండి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సింగపూర్‌లో ఎన్నికైన అధ్యక్షుడి పదవీకాలం ఆరేళ్లు ఉంటుంది.

అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం

66 ఏళ్ల షణ్ముగరత్నం కాకుండా మరో ఇద్దరు అభ్యర్థులు కూడా అధ్యక్ష రేసులో నిలిచారు. వీరిలో ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ మాజీ ఇన్వెస్ట్‌మెంట్ హెడ్ ఎన్‌జి కోక్ సాంగ్, ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా కంపెనీ మాజీ అధిపతి తన్ కిన్ లియాన్ ఉన్నారు. సాంగ్, లియాన్‌లకు వరుసగా 15.72 శాతం, 13.88 శాతం ఓట్లు వచ్చాయి. షణ్ముగరత్నం అధ్యక్ష ఎన్నికల్లో 70.40 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు.

ధర్మన్ షణ్ముగరత్నం గురించి

1957 ఫిబ్రవరి 25న సింగపూర్‌లో జన్మించిన ధర్మన్ షణ్ముగరత్నం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎకనామిక్స్‌లో BSc పట్టా పొందారు. దీని తరువాత అతను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని వోల్ఫ్సన్ కాలేజీకి వెళ్ళాడు. అక్కడ నుండి ఎకనామిక్స్ లో M.Phil చేసాడు. ఆ తర్వాత ఆర్థికవేత్తగా అనేక ముఖ్యమైన పోస్టుల్లో పనిచేశారు. అంతర్జాతీయ ద్రవ్య మరియు ఆర్థిక కమిటీకి అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆసియా నుండి మొదటి వ్యక్తి ధర్మన్ షణ్ముగరత్నం.

Also Read: US Apples: అమెరికన్ యాపిల్స్‌ దిగుమతిపై అదనపు సుంకం రద్దు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!

2001లో రాజకీయాల్లోకి ఎంట్రీ

సింగపూర్‌లోని పెద్ద రాజకీయ నాయకులలో ధర్మన్ షణ్ముగరత్నం కూడా ఒకరు. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందడానికి ముందు ధర్మన్ దేశ ఉప ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2001లో రాజకీయాల్లో చురుగ్గా ప్రవేశించారు. రాజకీయాల్లో చేరినప్పటి నుండి ధర్మన్ రెండు దశాబ్దాలకు పైగా అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP)తో ప్రభుత్వ రంగ, మంత్రి పదవులను నిర్వహించారు.

ధర్మన్ షణ్ముగరత్నం వ్యక్తిగత జీవితం

ధర్మన్ షణ్ముగరత్నం భారతీయ మూలానికి చెందినవారు. అతని పూర్వీకులు తమిళులు. అతను సింగపూర్‌లో స్థిరపడిన భారతీయ సమాజానికి చెందినవాడు. ధర్మన్ తండ్రి ప్రొఫెసర్ కె. షణ్ముగరత్నం వైద్య శాస్త్రవేత్త. ఆయనను ‘ఫాదర్ ఆఫ్ పాథాలజీ ఇన్ సింగపూర్’ అంటారు. సింగపూర్ క్యాన్సర్ రిజిస్ట్రీకి ఆయన పునాది వేశారు. ధర్మన్ షణ్ముగరత్నం వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే.. అతని కుటుంబంలో మొత్తం 6 మంది ఉన్నారు. అతని భార్య పేరు యుమికో ఇటోగి. వీరికి నలుగురు పిల్లలు.

గతంలో 1981 నుంచి 1985 వరకు కేరళకి చెందిన దేవన్ నాయర్ సింగపూర్ 3వ అధ్యక్షుడిగా సేవలు అందించారు. అనంతరం 2009లో భారత సంతతికి చెందిన సంతతికి చెందిన సెల్లపన్ రామనాథన్ సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా ధర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.