Site icon HashtagU Telugu

Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

Elon Musk

Elon Musk

Elon Musk: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో తన భాగస్వామి శివోన్ జిలిస్ గురించి కొన్ని వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్ట్‌ను చూసి ఆమె నేపథ్యం గురించి తెలియని చాలా మంది ఆశ్చర్యపోయారు. మస్క్ మాట్లాడుతూ.. తన భాగస్వామి శివోన్ జిలిస్ సగం భారతీయ మూలాలు కలిగి ఉన్నారని వెల్లడించారు. అంతేకాకుండా వారికి పుట్టిన కొడుకుకు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ అనే భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పేరుపై మధ్య పేరుగా ‘శేఖర్’ అని పెట్టామని కూడా ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ మస్క్ కుటుంబాన్ని కలిసినప్పుడు మస్క్ గర్ల్ ఫ్రెండ్‌గా శివోన్ జిలిస్ కూడా ఉన్నారు.

శివోన్ జిలిస్ ఎవరు?

కెనడాలోని ఒంటారియోలో జన్మించిన శివోన్ జిలిస్ తండ్రి కెనడియన్, తల్లి పంజాబీ. ఆమె 2008లో యాలే యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్- ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లో ఐస్ హాకీ జట్టులో క్రీడాకారిణిగా ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్, IBM వంటి పెద్ద గ్రూపులలో పనిచేశారు. ఆమె స్టార్టప్ భాగస్వామ్యాలను నిర్వహించారు. ఫైనాన్స్‌లో వృత్తిని లక్ష్యంగా చేసుకుని వెంచర్ క్యాపిటల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. శివోన్ మొదట టెస్టాలో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం శివోన్ చాలా సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పనిచేస్తున్నారు. AIలో నిపుణురాలైన శివోన్.. ఎలాన్ మస్క్‌తో కలిసి ఆయన ఇంట్లోనే నివసిస్తున్నారు. 2017లో న్యూరాలింక్‌లో చేరిన శివోన్ జిలిస్ ప్రస్తుతం ఆ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్నారు.

Also Read: NTR Bharosa Pension Scheme : ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ

భారతదేశంతో శివోన్ జిలిస్ బంధం ఏమిటి?

పాడ్‌కాస్ట్‌లో ఎలాన్ మస్క్ శివోన్ జిలిస్‌కు సంబంధించి అనేక వ్యక్తిగత సమాచారాన్ని పంచుకున్నారు. శివోన్ ఎప్పుడూ భారతదేశంలో నివసించకపోయినా ఆమె కుటుంబానికి భారతదేశంలో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉందని మస్క్ చెప్పారు. ఒక కెనడియన్ శివోన్‌ను దత్తత తీసుకున్నారు. అందుకే ఆమె కెనడాలో పెరిగారు. కానీ ఆమె నేపథ్యం ఏదో ఒక విధంగా భారతదేశంతో ముడిపడి ఉందని కూడా మస్క్ వెల్లడించారు. అయితే దీనికి మించిన వివరాలు ఇవ్వడానికి మస్క్ నిస్సహాయత వ్యక్తం చేశారు. మరోవైపు AI రంగంలో భారతీయ ప్రతిభ నుండి తాను చాలా నేర్చుకున్నానని శివోన్ గట్టిగా విశ్వసిస్తారు. 2016లో OpenAIలో చేరి 2023లో రాజీనామా చేసే వరకు శివోన్ OpenAI బోర్డులో అతి చిన్న వయస్కురాలైన సభ్యురాలుగా ఉన్నారు.

Exit mobile version