ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మానవులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇంజనీర్లు పర్వతాలను తొలగిస్తూ, లోయలను కలుపుతూ నిర్మించే వంతెనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి ఇంజనీరింగ్ అద్భుతాలలో చైనా మరోసారి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకప్పుడు గ్రేట్ వాల్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన చైనా, ఇప్పుడు మరో భారీ నిర్మాణంతో వార్తల్లో నిలిచింది. ఈ ఎత్తైన వంతెనను చూస్తే ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా అనిపిస్తుంది.
చైనాలోని గూయిజౌ ప్రావిన్స్‌లో హువాజియాంగ్ క్యాన్యన్ బ్రిడ్జి (Huajiang Canyon Bridge) నిర్మాణం పూర్తి కావస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిగా రికార్డు సృష్టించనుంది. ఈ వంతెన 2,051 అడుగుల (సుమారు 625 మీటర్లు) ఎత్తులో బీపాన్ నదిపై నిర్మించారు. దీనితో చైనా మరోసారి హై-ఎండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో తన సామర్థ్యాన్ని చాటుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన చైనాలోని డ్యుగే బ్రిడ్జి, దీని ఎత్తు 1,854 అడుగులు. అయితే హువాజియాంగ్ క్యాన్యన్ బ్రిడ్జి డ్యుగే బ్రిడ్జి రికార్డును అధిగమించనుంది. ఇది అమెరికాలోని వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (1,776 అడుగులు) కంటే సుమారు 300 అడుగులు ఎత్తుగా ఉండటం విశేషం. ఈ బ్రిడ్జి నిర్మాణానికి దాదాపు 283 మిలియన్ డాలర్లు ఖర్చయింది.
Grey Zone Warfare : గ్రే జోన్ వార్‌ఫేర్.. చైనా-పాకిస్తాన్ వ్యూహాలకు భారత్ కొత్త సవాళ్లు
హువాజియాంగ్ క్యాన్యన్ బ్రిడ్జి నిర్మాణం 2022లో ప్రారంభమైంది. ఇంత భారీ నిర్మాణం ఇంత తక్కువ సమయంలో పూర్తి కావడం నిజంగా ఒక అద్భుతం. సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టులకు ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుందని సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు చెబుతారు. కానీ చైనా ఇంజనీర్లు తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ దీన్ని వేగంగా పూర్తి చేశారు. ఈ వంతెనపై కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఒక గంట ప్రయాణ సమయం కేవలం మూడు నిమిషాలకు తగ్గిపోతుంది. ఇది స్థానికుల రోజువారీ జీవితాన్ని ఎంతో మార్చనుంది, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది.
ప్రపంచంలోని అత్యంత ఎత్తైన బ్రిడ్జిలలో ఎక్కువ భాగం చైనాలోనే ఉన్నాయి. టాప్ 6 వంతెనలు చైనాలోనే ఉండగా, ప్రపంచంలోని టాప్ 50 బ్రిడ్జిలలో 43 అక్కడే ఉన్నాయి. అమెరికాలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం చైనాలోని పర్వత ప్రాంతాలు, ముఖ్యంగా పశ్చిమ, నైరుతి ప్రాంతాలు. గూయిజౌ ప్రావిన్స్ దీనికి ఒక ఉదాహరణ. లోతైన లోయలు, కఠినమైన భూభాగాల గుండా రోడ్లు వేయడం కష్టం. అందుకే వేగవంతమైన, డైరెక్ట్ మార్గాల కోసం వంతెనలు నిర్మించడం తప్పనిసరి. ఈ వంతెన గూయియాంగ్, అన్‌షున్, కియాన్‌క్సినాన్ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని గూయిజౌ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ చెన్ జియాన్‌లీ తెలిపారు.