బ్రిటన్ రాచ కుటుంబంపై ప్రిన్స్ హ్యారీ (Prince Harry) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ప్రేమకు ప్రతిరూపమైన తన తల్లి డయానా చనిపోతే కనీసం కరువుదీరా ఏడవలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ (మంగళవారం) విడుదల కానున్న తన స్వీయచరిత్ర ‘స్పేర్’లో ఇందుకు సంబంధించిన విషయాలన్నీ ప్రస్తావించానని వెల్లడించారు.
1997 ఆగస్టు 31న తల్లి డయానా మరణించిన తర్వాత అంతిమ యాత్ర వేళ చోటుచేసుకున్న పరిణామాలను ప్రిన్స్ హ్యారీ (Prince Harry) ఒకసారి నెమరు వేసుకున్నారు. ‘‘ఏం జరిగినా ఏడవకూడదన్నది బ్రిటన్ రాజకుటుంబం నియమం. ఇలాంటి వాటిని చిన్నతనం నుంచే రుద్దీ రుద్దీ నా హృదయాన్ని బండబార్చారు. దాంతో మా అమ్మ చనిపోయి అంతులేని శూన్యాన్ని మిగిల్చినా ఆ దుర్భర ఆవేదనను బయట పెట్టే స్వేచ్ఛ కూడా లేకపోయింది. దాన్నంతటినీ గుండెల్లోనే అదిమి పెట్టి మా అమ్మ కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చిన అభిమానులను నవ్వుతూ పలకరించాల్సి వచ్చింది. కానీ వారిలో ఎవరితో కరచాలనం చేసినా అరచేతులన్నీ తడితడిగా తగిలాయి. అవన్నీ వారి కన్నీళ్లతో తడిశాయని అర్థమై చాలా సిగ్గుపడ్డా. ఆ వీడియోలను ఇప్పుడు చూసినా నాకు సిగ్గేస్తుంటుంది” ప్రిన్స్ హ్యారీ ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “మా అమ్మ చనిపోయిందనే విషయాన్ని చాలా కాలం పాటు నేను అంగీకరించలేకపోయాను. ఆమె మాకు ఎప్పటికీ ఇలా చేయదని నేను బాల్యంలో అనుకునే వాడిని” అని హ్యారీ తన బుక్ లో చెప్పుకొచ్చాడు.
ప్రిన్స్ విలియం బెస్ట్ మ్యాన్ కాదు:
ఆగస్ట్ 31, 1997న ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో యువరాణి డయానా మరణించారు. తన తల్లి ప్రమాదానికి గురైన ఆ సొరంగంలో నుంచి డ్రైవింగ్ చేసే క్రమంలో ఎదురైన ఫీలింగ్స్ గురించి కూడా ప్రిన్స్ హ్యారీ తన పుస్తకంలో ప్రస్తావించాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నప్పటి నుంచి అతని సోదరుడు విలియమ్‌తో విభేదాల వరకు ప్రతి అంశాన్ని తన ఆత్మకథలో ఆయన ప్రస్తావించారు. తన అన్నయ్య ప్రిన్స్ విలియం గురించి చెబుతూ.. అతడు “బెస్ట్ మ్యాన్” కాదు అని చెప్పాడు. మేఘన్ తో తన పెళ్లికి అతడు సహకరించలేదని స్పష్టం చేశారు. పెళ్లి కొడుకుకు చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తిని ” బెస్ట్ మ్యాన్ ” అని పిలుస్తారు. తన పెళ్లిలో బెస్ట్ మ్యాన్ గా చార్లీ అనే ఒక స్నేహితుడు ఉన్నాడని పాత జ్ఞాపకాలను హ్యారీ నెమరువేసుకున్నారు.
Also Read: Rishi Sunak : రిషి సునాక్ కు రానున్న సాధారణ ఎన్నికల్లో ఎదురుదెబ్బ..?