Singapore Passport : ప్రపంచంలోనే పవర్ ఫుల్ పాస్‌పోర్ట్ ఏదో తెలుసా ? సింగపూర్ దేశానిది !! జనవరి 8వ తేదీన విడుదలైన ‘ది హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025’లో ఈవిషయాన్ని ప్రకటించారు. గతేడాది (2024లో) కూడా సింగపూర్ పాస్‌పోర్టే నంబర్ 1 ప్లేసులో నిలిచింది. ఇక ఇదే సమయంలో ఈసారి మన భారతదేశ పాస్‌పోర్టు 85వ స్థానంలో నిలిచింది. ఇంతకీ సింగపూర్ పాస్‌పోర్టు ఎందుకంత స్ట్రాంగ్‌గా ఉంది ? ఈ కథనంలో చూద్దాం..
Also Read :Names Vs Songs : ఈ ఊరిలో ఎవరికీ పేర్లు ఉండవు.. పాట పాడి పిలుస్తారు
సింగపూర్ పాస్‌పోర్ట్ ఎందుకు బలంగా ఉంది ?
అత్యధిక సందర్శనలకు అవకాశం
సింగపూర్ పాస్‌పోర్ట్ మన చేతిలో ఉంటే విదేశీ ప్రయాణం చాలా ఈజీ. ఎందుకంటే దానితో ప్రపంచంలోని 195 ప్రధాన నగరాలకు వీసా లేకుండానే నేరుగా వెళ్లొచ్చు. ఈ పాస్‌పోర్ట్‌తో వెళితే చాలా దేశాల్లో విమానం దిగగానే వీసా మంజూరు చేస్తారు. వ్యాపారం అయినా, టూర్ అయినా సింగపూర్ పాస్‌పోర్ట్ చేతిలో ఉంటే ఆ మజాయే వేరు.
వ్యూహాత్మక దౌత్య సంబంధాలు
సింగపూర్‌కు విదేశాలతో ఉన్న బలమైన దౌత్య సంబంధాల వల్ల ఆ దేశ పాస్‌పోర్ట్(Singapore Passport) చాలా స్ట్రాంగ్‌గా మారింది. మెరుగైన దౌత్య సంబంధాలు ఉన్నందు వల్లే సింగపూర్ దేశస్తులకు విదేశాలు రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానం పలుకుతున్నాయి. వీసా లేకుండానే తమ దేశాల్లోకి ప్రవేశించే ఛాన్స్ ఇస్తున్నాయి. సింగపూర్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా టూరిజంపై ఆధారపడి ఉంది. టూరిజం వికాసం కోసం, విదేశాల నుంచి తమ దేశానికి టూరిస్టులు వచ్చేందుకు చాలా రకాల టూరిజం పథకాలను సింగపూర్ అమలుచేస్తోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా దాని ప్రతిష్ఠ ఇనుమడించింది.
సుస్థిర ఆర్థిక వికాసం
సింగపూర్ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది. అది సుస్థిరంగా తన పురోగతిని సాగిస్తోంది. అందువల్లే యావత్ ప్రపంచం సింగపూర్‌ను సానుకూల కోణంలో చూస్తోంది. అన్ని దేశాలు దానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ కారణం వల్లే సింగపూర్ పాస్‌పోర్ట్ బలం అంతగా పెరుగుతోంది. ఆర్థికంగా బలంగా ఉన్న సింగపూర్ నుంచి ఎవరు వచ్చినా స్వాగతం పలికేందుకు విదేశాలు నిరభ్యంతరంగా సిద్ధమవుతున్నాయి.
భద్రతకు భరోసా
సింగపూర్ పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. ఎన్నో దశల వడపోత తర్వాత సింగపూర్ ప్రభుత్వం పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తుంది. ఈవిషయం ప్రపంచ దేశాలకు బాగా తెలుసు. అన్ని దశల వడపోతల తర్వాత చెడు వ్యక్తుల చేతికి సింగపూర్ పాస్‌పోర్ట్ దక్కదనే విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి. అందుకే సింగపూర్ పాస్‌పోర్ట్ పేరు వినగానే ప్రపంచదేశాలు గుడ్డిగా విశ్వసించేందుకు రెడీ అవుతున్నాయి. సింగపూర్ పాస్‌పోర్ట్‌తో వచ్చే వారికి ఎలాంటి ఆంక్షలూ పెట్టడం లేదు.
అత్యాధునిక బయోమెట్రిక్ టెక్నాలజీ
సింగపూర్‌లో 2006 సంవత్సరం నుంచి అత్యాధునిక బయోమెట్రిక్ టెక్నాలజీతో వీసాలను జారీ చేస్తున్నారు. ఈ వీసాలో మైక్రోచిప్ ఉంటుంది. మైక్రో చిప్‌లో సదరు వ్యక్తుల ఫొటోలు, ఫింగర్ ప్రింట్స్ వంటివన్నీ సురక్షితంగా నిక్షిప్తమై ఉంటాయి. సింగపూర్‌లో అన్ని విమానాశ్రయాల్లో ఈ-గేట్లు ఉంటాయి. వాటిలో బయోమెట్రిక్ పాస్‌పోర్టును స్కాన్ చేసి ఎంచక్కా లోపలికి వెళ్లిపోవచ్చు. తద్వారా సింగపూర్‌కు వెళ్లే టూరిస్టులకు ఈజీగా బార్డర్ క్లియరెన్స్ లభిస్తుంది. మనదేశంలోనూ బయోమెట్రిక్ పాస్‌పోర్ట్ వ్యవస్థ 2008లో మొదలైంది.