Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) యాంటిఫా (Antifa)ను ఒక ప్రధాన ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. ట్రంప్ సన్నిహితుడు, మితవాద రాజకీయ కార్యకర్త అయిన చార్లీ కిర్క్ (Charlie Kirk) హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్ ద్వారా యాంటిఫాకు నిధులు సమకూర్చేవారిపై కఠినమైన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.
ట్రంప్ ప్రకటనలోని ముఖ్యాంశాలు
ట్రంప్ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. యాంటిఫా ఒక అనారోగ్యకరమైన, ప్రమాదకరమైన, అతివాద వామపక్ష విపత్తు. దానిని ప్రధాన ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తున్నందుకు మా అమెరికన్ దేశభక్తులకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను అన్నారు. యాంటిఫాకు నిధులు సమకూర్చేవారిపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, దోషులను విడిచిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Heavy Rains: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ!
చార్లీ కిర్క్ గురించి స్టీఫెన్ మిల్లర్ వ్యాఖ్యలు
యాంటిఫా అనేది “ఫాసిజం వ్యతిరేకం” అనే పదానికి సంక్షిప్త రూపం. ఈ సంస్థ వామపక్ష అతివాద సమూహాలను సూచిస్తుంది. ఈ వారం మొదట్లో వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ మాట్లాడుతూ.. చార్లీ కిర్క్ తమకు పంపిన చివరి సందేశంలో హింసకు ప్రేరేపించిన వామపక్ష సమూహాలపై చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపారు. వారిని అంతం చేయడానికి ఫెడరల్ ప్రభుత్వం అందుబాటులో ఉన్న ప్రతి వనరును పూర్తిగా వినియోగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కాగా డొనాల్డ్ ట్రంప్ మే 2020లోనే యాంటిఫా ఉద్యమాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు.
యాంటిఫా అంటే ఏమిటి?
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) అనే లాభాపేక్ష లేని విధాన పరిశోధనా సంస్థ ప్రకారం యాంటిఫా అనేది ఫాసిస్ట్, జాత్యహంకార లేదా ఇతర మితవాద అతివాదులను వ్యతిరేకించే అతివాద వామపక్ష తీవ్రవాదుల నెట్‌వర్క్. CSIS ప్రకారం యాంటిఫా ఉపయోగించే సాధారణ చిహ్నాలలో 1917 రష్యన్ విప్లవం ఎర్ర జెండా, 19వ శతాబ్దపు అరాచకవాదుల నల్ల జెండా ముఖ్యమైనవి. ఈ గ్రూపులు తరచుగా మితవాద సమావేశాలు, ర్యాలీలను అడ్డుకోవడానికి నిరసనలు నిర్వహిస్తాయి. సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్ పీర్-టు-పీర్ నెట్‌వర్క్‌లు, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌ల ద్వారా తమ కార్యకలాపాలను నిర్వహించుకుంటాయని చెబుతారు.
