Site icon HashtagU Telugu

Jamal Khashoggi: ఎవరు ఈ జమాల్ ఖషోగ్గీ? ఆయన హత్యకు కారణాలు ఏమిటి?

Jamal Khashoggi

Jamal Khashoggi

Jamal Khashoggi: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) ఇటీవల అమెరికాను సందర్శించారు. 2018 తర్వాత ఆయనకు ఇదే మొదటి పర్యటన. ఈ పర్యటనలో ఆయనకు మరోసారి జమాల్ ఖషోగ్గీ (Jamal Khashoggi) హత్యకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం సందర్భంగా ఖషోగ్గీకి సంబంధించిన ప్రశ్న ప్రిన్స్‌ను అసౌకర్యానికి గురి చేసింది. ఆ సమయంలోనే ఖషోగ్గీ పేరు మరోసారి చర్చనీయాంశమైంది. ఖషోగ్గీ హత్య జరిగి ఏడేళ్లు అవుతున్నా.. అందులో సౌదీ రాజకుటుంబం పేరు వినిపించింది. అసలు జమాల్ ఖషోగ్గీ ఎవరు? ఆయన హత్య ఎందుకు జరిగింది? తెలుసుకుందాం.

ఎవరు ఈ జమాల్ ఖషోగ్గీ?

జమాల్ ఖషోగ్గీ సౌదీ అరేబియాలోని మదీనాలో సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన జీవితం కూడా సౌదీ రాజకుటుంబం చుట్టూనే గడిచింది. ఆయన తాత మహమ్మద్ ఖషోగ్గీ కూడా సౌదీ అరేబియా వ్యవస్థాపకుడు షా అబ్దుల్ అజీజ్ వ్యక్తిగత వైద్యుడిగా ఉన్నారు. ఖషోగ్గీ సౌదీ అరేబియాలోని పురాతన వార్తాపత్రికలలో ఒకటైన అల్-మదీనాతో అనుబంధం కలిగి ఉన్నారు. అక్కడి నుంచే ఆయన గొంతు ప్రపంచవ్యాప్తంగా వినిపించడం ప్రారంభమైంది. ఆయన గట్టిగా మాట్లాడే జర్నలిస్టుగా పేరు పొందారు.

ఉన్నత పదవుల్లో ఖషోగ్గీ

సౌదీ రాజకుటుంబం తీసుకున్న కొన్ని నిర్ణయాలు జమాల్ ఖషోగ్గీకి నచ్చకపోయేవి. వాటిపై ఆయన బహిరంగంగా మాట్లాడేవారు. అంతేకాకుండా ఒసామా బిన్ లాడెన్ దాడులపై కూడా ఆయన గట్టిగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఖషోగ్గీ చాలాసార్లు ఒసామా బిన్ లాడెన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఖషోగ్గీ అల్-వతన్ పత్రికకు సంపాదకుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత జర్నలిజం నుంచి బ్రేక్ తీసుకుని, సౌదీ అరేబియా రాయబారి ప్రిన్స్ తుర్కీ అల్-ఫైసల్‌కు సలహాదారుగా, ప్రతినిధిగా పనిచేశారు.

సౌదీ రాజరికంలో మార్పు

2015లో సౌదీ రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ మరణించారు. ఆ తరువాత ఆయన సవతి సోదరుడు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సమయంలోనే సల్మాన్ తన కుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్‌ (MBS)ను రక్షణ మంత్రిగా నియమించారు. బిన్ సల్మాన్ రెండు నెలల్లోనే యెమెన్‌పై బాంబు దాడికి ఆదేశించారు, ఇది అంతర్యుద్ధానికి దారితీసింది.

ట్రంప్-ఖషోగ్గీ వివాదం

2016లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా జమాల్ ఖషోగ్గీ విమర్శలు చేయడంతో వివాదం తలెత్తింది. ఆయన ట్రంప్‌ను విమర్శించడం సౌదీ రాజకుటుంబానికి ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే వారిలో చాలా మంది ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు. ఖషోగ్గీ విమర్శించడంతో సౌదీ ప్రభుత్వం ఆయన నుంచి తమను తాము వేరు చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఖషోగ్గీ అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవని. అవి ప్రభుత్వం తరపున చెప్పినవి కావని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ఎప్పుడంటే?!

దేశం విడిచి వెళ్లక తప్పని పరిస్థితి

కొన్ని రోజుల తర్వాత సౌదీ ప్రభుత్వం ఆయనపై ఆంక్షలు విధించడం ప్రారంభించిందని నివేదికలు చెబుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదా ఏ సదస్సులో పాల్గొనడంపై కూడా నిషేధం విధించారు. చివరకు ఆయన ఎవరికోసం ట్వీట్ చేయకూడదనే నిబంధన కూడా పెట్టారు. దీని తరువాత 2017లో కొందరు రచయితలను అరెస్టు చేయగా, ఖషోగ్గీ కూడా తన దేశాన్ని విడిచిపెట్టి అమెరికా వెళ్లవలసి వచ్చింది. అదే సంవత్సరంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ క్రౌన్ ప్రిన్స్‌గా నియమితులయ్యారు.

పెళ్లి ఏర్పాట్లలో ఖషోగ్గీ

ఖషోగ్గీ అనేక పెద్ద న్యూస్ సైట్‌లకు రాసేవారు. ఆయన రాసిన వ్యాసాలు చాలా పదునుగా ఉండేవి. ఎవరినైనా ఇబ్బంది పెట్టగలవు. ఈ సమయంలో సౌదీ ప్రభుత్వంతో ఆయన సంబంధాలు సరిగా లేవు. 2018లో ఆయన పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీని కోసం కొన్ని డాక్యుమెంట్లు అవసరం కావడంతో వాటిని తీసుకోవడానికి ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా కామర్షియల్ రాయబార కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన కాబోయే భార్య కూడా ఆయనతోనే ఉన్నారు. కానీ ఆమె బయట వేచి ఉన్నారు.

ఇస్తాంబుల్‌లో ఖషోగ్గీ హత్య

అక్టోబర్ 2, 2018న ఖషోగ్గీ ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా కామర్షియల్ రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. రాయబార కార్యాలయంలో సౌదీ అరేబియా ప్రభుత్వం పంపిన కొందరు వ్యక్తులు అప్పటికే ఉన్నారని టర్కీ గూఢచార సంస్థలు తెలిపాయి. రాయబార కార్యాలయం లోపలికి వెళ్లిన దాదాపు 10 నిమిషాల తర్వాత జమాల్ ఖషోగ్గీ మరణించారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా ఆయన హత్యకు ఆమోదం తెలిపారని మీడియా నివేదికల్లో పేర్కొన్నారు. అయితే సౌదీ దీనిని ఖండిస్తూ వచ్చింది.

మళ్లీ వార్తల్లో ఖషోగ్గీ పేరు

2025లో జమాల్ ఖషోగ్గీ పేరు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రస్తుతం అమెరికాలో ఉండగా.. అక్కడ ట్రంప్‌తో సమావేశం సందర్భంగా జర్నలిస్టులు ఆయన హత్యకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. అయితే ఈ ప్రశ్నలపై డొనాల్డ్ ట్రంప్ ప్రిన్స్‌ను సమర్థిస్తూ ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే అని పేర్కొన్నారు.

Exit mobile version