Netanyahu : గాజాపై యుద్ధాన్ని ఆపం.. మా నెక్ట్స్ టార్గెట్ హిజ్బుల్లా : నెతన్యాహు

గాజా మిలిటెంట్ సంస్థ హమాస్‌‌పై యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు.

  • Written By:
  • Updated On - June 25, 2024 / 09:20 AM IST

Netanyahu : గాజా మిలిటెంట్ సంస్థ హమాస్‌‌పై యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు. కేవలం హమాస్‌తో పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రమే తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. గాజాలో పాలనా పగ్గాలను పాలస్తీనా అథారిటీకి అప్పగించబోమని నెతన్యాహు తేల్చి చెప్పారు. ప్రాంతీయంగా ఉన్న కొన్ని అరబ్ దేశాల సహకారంతో గాజాలో పాలన సాగుతుందని వెల్లడించారు. హమాస్ పూర్తిగా అంతమైతే తప్ప గాజాపై యుద్ధం ఆగదని ఆయన తెలిపారు. అప్పటివరకు పాక్షిక ఒప్పందాలు మాత్రమే ఉంటాయన్నారు. ఇజ్రాయెలీ టీవీ ఛానల్‌ 14కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘గాజాలో హమాస్‌పై యుద్ధం దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం తీవ్రస్థాయిలో యుద్ధం జరగడం లేదు. ఇకపై మా ఫోకస్ లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లపై ఉంటుంది’’ అని నెతన్యాహు వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై భీకర దాడులు చేస్తున్న హిజ్బుల్లాను వదిలేది లేదన్నారు.

We’re now on WhatsApp. Click to Join

హిజ్బుల్లా ‘న్యూక్లియర్’ వార్నింగ్

హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుంటుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటి నుంచి హిజ్బుల్లా యాక్టివ్ మోడ్‌లోకి వచ్చింది. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా లెబనాన్ సరిహద్దుల సమీపంలోని ఇజ్రాయెలీ భూభాగాలపై అది మిస్సైళ్లు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల భయానికి లెబనాన్ సరిహద్దులలోని పదుల సంఖ్యలో గ్రామాలు, పట్టణాలన్నీ ఖాళీ అయ్యాయి. ఆయా గ్రామాలు, పట్టణాల ప్రజలు సెంట్రల్ ఇజ్రాయెల్ ప్రాంతానికి వలస వెళ్లారు. దీంతో ఇజ్రాయెల్‌లో ఆ భూభాగంలో నిర్మానుష్య పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు లెబనాన్ సరిహద్దుకు సమీపంలోని ఇజ్రాయెల్ ఆర్మీ చెక్ పోస్టులు, ఆయుధ స్థావరాలపైకి మిస్సైళ్లతో హిజ్బుల్లా విరుచుకుపడుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం చేస్తే.. తాము ఇజ్రాయెల్‌కు చెందిన అణ్వాయుధ కేంద్రాలపై డ్రోన్ దాడులు చేస్తామని హిజ్బుల్లా ఇటీవల వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌లోకి వెళ్లిన తమ డ్రోన్లు ఆ దేశానికి చెందిన అణ్వాయుధ కేంద్రాల చిట్టాను తీసుకొచ్చాయని హిజ్బుల్లా అంటోంది. మరోవైపు అమెరికాకు కూడా ఇజ్రాయెల్‌ను శాంతింపజేసే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. హిజ్బుల్లాతో యుద్ధం చేయొద్దని నెతన్యాహుకు సూచిస్తోంది.

Also Read : Julian Assange : ‘వికీలీక్స్’ అసాంజేకు విముక్తి.. 1901 రోజుల తర్వాత జైలు నుంచి స్వేచ్ఛ

యెమన్ హౌతీలు.. 

ఇంకోవైపు  ఎర్రసముద్రం మీదుగా వెళ్లే వాణిజ్యనౌకలపై యెమన్ దేశానికి చెందిన హూతీ మిలిటెంట్ల దాడులు ఆగడం లేదు. తాజాగా గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌లో ఓ వాణిజ్యనౌకపై ఎటాక్ చేశారు. అయితే సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. దాడి విషయాన్ని బ్రిటన్‌ సైన్యానికి చెందిన యునైెటెడ్‌ కింగ్‌డమ్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్‌ సెంటర్‌ ప్రకటించింది. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగానే యెమన్ హౌతీలు కూడా ఎర్రసముద్రంలో విదేశీ నౌకలపై దాడులు చేస్తున్నారు.