. రష్యా ఆగ్రహం..ఇది సముద్రపు దోపిడీ
. షాడో ఫ్లీట్ లక్ష్యంగా అమెరికా వ్యూహం
. వెనెజువెలాపై ఆంక్షల అమలులో భాగంగానే ఈ చర్య
Russia: వెనెజువెలాతో అక్రమ చమురు లావాదేవీలు ఉన్నాయనే అనుమానాల నేపథ్యంలో రష్యా జెండాతో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన అమెరికా–రష్యా మధ్య ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న సంబంధాలను మరింత ముదిర్చింది. ఐస్‌లాండ్‌కు దక్షిణంగా సుమారు 190 మైళ్ల దూరంలో ‘మారినెరా’ అనే రష్యన్ ట్యాంకర్‌ను అమెరికా రక్షణ శాఖ, యూఎస్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా సీజ్ చేశాయి. ఈ ఆపరేషన్‌కు బ్రిటన్ కూడా సహకారం అందించింది. హెలికాప్టర్ల సాయంతో నౌకపైకి దిగిన అమెరికా మెరైన్లు సిబ్బందిని అదుపులోకి తీసుకుని నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇదే సమయంలో జెండా లేని ‘ఎం/టీ సోఫియా’ అనే మరో నౌకను కూడా అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
ఈ ఘటనపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా చట్టసభ సభ్యుడు అలెక్సీ జురావ్లెవ్ అమెరికా చర్యలను తీవ్ర పదజాలంతో ఖండించారు. “అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏం చేసినా శిక్ష ఉండదన్న అహంకారంతో ముందుకు వెళ్తోంది. ఇలాంటి చర్యలు కొనసాగితే సైనిక ప్రతిస్పందన తప్పదు. అవసరమైతే అమెరికా కోస్ట్ గార్డ్ పడవలను టార్పిడోలతో ముంచివేయాల్సి వస్తుంది” అంటూ ఆయన హెచ్చరిక జారీ చేశారు. రష్యా అధికారులు ఈ చర్యను నేరుగా ‘సముద్రపు దోపిడీ’గా అభివర్ణించారు. అంతర్జాతీయ సముద్ర చట్టాలకు ఇది పూర్తిగా విరుద్ధమని రష్యా రవాణా శాఖ అధికారికంగా నిరసన వ్యక్తం చేసింది. అమెరికా తన శక్తిని ప్రదర్శించేందుకు చట్టాలను పక్కనపెడుతోందని మాస్కో ఆరోపిస్తోంది.
వెనెజువెలా చమురు ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలను కఠినంగా అమలు చేయడమే ఈ ఆపరేషన్‌కు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆంక్షలను తప్పించుకోవడానికి వెనెజువెలా, ఇరాన్ వంటి దేశాలు ‘షాడో ఫ్లీట్’గా పిలవబడే రహస్య నౌకల నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నాయన్నది అమెరికా ఆరోపణ. జెండాలు మార్చడం, ట్రాకింగ్ వ్యవస్థలను ఆపేయడం వంటి పద్ధతులతో ఈ నౌకలు చమురును తరలిస్తున్నాయని వాషింగ్టన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర అట్లాంటిక్‌లో అమెరికా తన నిఘాను పెంచి, అనుమానాస్పద నౌకలపై చర్యలకు దిగుతోంది. అయితే తాజా ఘటనతో అమెరికా–రష్యా మధ్య సముద్రంలోనే కాకుండా దౌత్య రంగంలోనూ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ వివాదం ఎటు దారి తీస్తుందన్నది ప్రపంచ రాజకీయ వేదికపై ఆసక్తికరంగా మారింది.
