థాయ్‌లాండ్ – కంబోడియా (Thailand-Cambodia Clash) మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో థాయ్‌లాండ్ వెళ్లే భారతీయ ప్రయాణికులకు భారత ఎంబసీ ట్రావెల్ అడ్వైజరీ (Indian Embassy Travel Advisory) హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా విహారయాత్రల కోసం పెద్ద ఎత్తున భారతీయులు థాయ్‌లాండ్‌కు వెళ్లడం జరుగుతుండటంతో, ఈ హెచ్చరిక కీలకంగా మారింది. భద్రతా కారణాల రీత్యా కొన్ని ప్రత్యేక ప్రాంతాలను వీలైనంతవరకు నివారించాలని సూచించారు.
థాయ్‌లాండ్‌లోని భారత ఎంబసీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఎక్స్ పోస్టు చేసి భారతీయుల్ని అప్రమత్తం చేసింది. ఈ పోస్టులో థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని, అందువల్ల అక్కడికి ప్రయాణించడం విహారయాత్రికులు మానుకోవాలన్నారు. ట్రావెల్ చేసేందుకు ముందుగా స్థానిక అధికార వర్గాలనుంచి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది.
Gali Kireeti Reddy : నెక్స్ట్ ఏంటి గాలి ..?
థాయ్‌లాండ్ టూరిజం అథారిటీ కూడా ఈ నేపథ్యంలో కీలక హెచ్చరికలు జారీ చేసింది. వీటి ప్రకారం రాట్చథాని, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కేయో, చంతబురి, ట్రాట్ వంటి ప్రాంతాలకు వెళ్లకూడదని పేర్కొంది. ఈ ప్రాంతాలు కంబోడియా సరిహద్దుకు సమీపంగా ఉండటంతో అక్కడ భద్రతా పరిస్థితులు గందరగోళంగా ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇలాంటి ప్రాంతాల్లో తిరిగే టూరిస్టులు అజ్ఞాత ప్రమాదాల్లో చిక్కుకునే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో థాయ్‌లాండ్ ప్రయాణించే భారతీయులు TAT News Room, థాయ్‌లాండ్ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లు, అలాగే భారత ఎంబసీ ఎలర్ట్‌లను తరచూ ఫాలో అవుతూ తాజా సమాచారం తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే తమ పాస్‌పోర్ట్, వీసా సమాచారం, భారత ఎంబసీ నెంబర్లు దగ్గర ఉంచుకోవాలని సూచిస్తున్నారు. సురక్షితమైన ప్రాంతాలకే పరిమితమై ప్రయాణించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.