ఇరాన్ మరియు అమెరికా దేశాల మధ్య మళ్లీ మొదలైన దాడుల పర్వం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా రాత్రి నుంచి జరుపుతున్న వరుస దాడుల కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) జలసంధి గుండా నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో సరఫరా నిలిచిపోతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడాయిల్ ధర ఇవాళ ఒక్కరోజే ఏకంగా 4.30% ఎగబాకి, బ్యారెల్‌కు 79 డాలర్లకు చేరుకుంది
రానున్న రోజుల్లో ఈ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం గనుక ఇలాగే కొనసాగితే, క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ అంతర్జాతీయ సంక్షోభం భారతదేశంపై నేరుగా ప్రభావం చూపనుంది. మన దేశం తన చమురు అవసరాలలో దాదాపు 80% పైగా దిగుమతుల ద్వారానే పొందుతున్నందున, ముడిచమురు ధరల పెరుగుదల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే దేశంలో ఇంధన ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు సగటు సామాన్యుడిపై ఇది మరింత ఆర్థిక భారాన్ని మోపడమే కాకుండా, నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉంది.
