Vivek Ramaswamy : ట్రంప్‌కు మద్దతు ప్రకటించిన వివేక్.. అమెరికా అధ్యక్ష రేసుకు గుడ్‌బై

Vivek Ramaswamy : అమెరికా అధ్యక్ష రేసు నుంచి భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(38) తప్పుకున్నారు. 

  • Written By:
  • Publish Date - January 16, 2024 / 11:02 AM IST

Vivek Ramaswamy : అమెరికా అధ్యక్ష రేసు నుంచి భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(38) తప్పుకున్నారు.  అయోవా రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ  ఆధిక్యంతో గెలిచారు. వివేక్ రామస్వామి కేవలం 7.7 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. దీంతో ఆయన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసు నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. అంతేకాదు.. రామస్వామి తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. ఏవైనా నేరాభియోగాల్లో ట్రంప్‌‌ను కోర్టులు దోషిగా తేల్చినా..  ఆయన వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. ఈ ఫలితాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపానన్నారు. ఇకపై తన పూర్తి సపోర్ట్  ట్రంప్‌కే ఉంటుంది తేల్చి చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

వివేక్ రామస్వామి ఒహియో రాష్ట్ర వాస్తవ్యుడు. ఈయన తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్న వివేక్ రామస్వామి 2021 సంవత్సరంలో “Woke, Inc.,” అనే పుస్తకాన్ని రాశారు. అది చాలా బాగా అమ్ముడుపోయింది. ఈ పుస్తకంలో సామాజిక న్యాయం, వాతావరణ మార్పులు, కార్పొరేట్ నిర్ణయాలు వంటి అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. 2023 ఫిబ్రవరి నుంచే  వివేక్ రామస్వామి(Vivek Ramaswamy)  రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా  అధ్యక్ష అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్నారు. అయితే ఇమిగ్రేషన్‌పై ఆయన తన బలమైన అభిప్రాయాలను వినిపించడం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. తద్వారా తొలిసారిగా అమెరికా ప్రజల దృష్టిని ఆకర్షించారు.  మొదటి నుంచే వివేక్ రామస్వామి ప్రచార వ్యూహం, వ్యాఖ్యల స్వరం, విధానపరమైన అభిప్రాయాలు డొనాల్డ్ ట్రంప్‌కు దగ్గరగానే ఉంటాయి. ఈక్రమంలోనే ఆయన ట్రంప్‌కు మద్దతును ప్రకటించడం గమనార్హం.అయితే ఇదంతా వ్యూహాత్మకంగానే జరుగుతున్నట్లుగా అనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్‌కు బలాన్ని పెంచేలా తెర వెనుక నుంచి అమెరికాలోని కీలకమైన వ్యాపార వర్గాల లాబీలు పావులు కదుపుతున్నాయని అంటున్నారు.

Also Read: Chanakya Niti : ఏడ్చే మహిళలపై చాణక్యుడు ఏం చెప్పారో తెలుసా ?

రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం పొందే దిశగా  డొనాల్డ్ ట్రంప్ కీలక పురోగతి సాధించారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేయడంపై అమెరికాలోని అయోవా స్టేట్‌లో నిర్వహించిన ప్రైమరీ ఎలక్టోరల్ ఎలక్షన్‌లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు అత్యధికంగా 52.8 శాతం మేర ఓట్లు వచ్చాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండోస్థానంలో  రాన్ డీశాంటీస్ నిలిచారు. ఈయనకు 21.4  శాతం ఓట్లు వచ్చాయి. దీన్నిబట్టి అమెరికా ప్రజలు పాలనా వ్యవహారాల్లో శ్వేత జాతీయులకే ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టమైంది. భారత సంతతికి చెందిన  నిక్కీ హేలీకి 17.7 శాతం ఓట్లు, వివేక్ రామస్వామికి 7.2 శాతం ఓట్లు మాత్రమే(Trump Win) పడ్డాయి. అయోవా స్టేట్‌లో రిపబ్లికన పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కావడానికి 1,215 ఓట్లు అవసరం. అయితే డొనాల్డ్ ట్రంప్‌కు మొదటి రౌండ్‌లోనే 2,035 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన రాన్ డీశాంటీస్‌కు 824 ఓట్లు వచ్చాయి. నిక్కీ హేలీకి 682 ఓట్లు, వివేక్ రామస్వామికి 278 ఓట్లు  పడ్డాయి. దీంతో వరుసగా మూడోసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమం అవుతోందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.