Vivek Ramaswamy: జనవరి 20న అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కొలువుతీరబోతోంది. ఆ ప్రభుత్వంలోని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ’ విభాగం బాధ్యతలను భారత సంతతి రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేపట్టనున్నారు. ఆ కీలక బాధ్యతలను చేపట్టకముందే.. తనదైన శైలిలో మాట్లాడటాన్ని వివేక్ మొదలుపెట్టారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ ప్రభుత్వం వైఫల్యాలను ఆయన ఎండగడుతున్నారు. న్యూయార్క్ నగరంలోని మ్యాన్ హాటన్ ఏరియాలో పాకిస్తాన్ ప్రభుత్వానికి రూజ్‌వెల్ట్ పేరుతో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్‌కు జో బైడెన్ ప్రభుత్వం రూ.1,860 కోట్లను చెల్లించి.. అందులో అక్రమ వలసదారులకు వసతి కల్పించింది. బైడెన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ఫైర్ అయ్యారు. అమెరికా ప్రజలు చెల్లించిన పన్నులను పాకిస్తాన్ ప్రభుత్వానికి కట్టబెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. అక్రమ వలసదారుల వసతి కోసం.. అమెరికా ఖజానా నుంచి అంత భారీగా మొత్తాన్ని ఖర్చు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Tritiya Jewellers : హీరోయిన్స్‌కే కుచ్చుటోపీ పెట్టిన మోసగాడు.. కటాకటాల వెనక్కి కాంతిదత్
అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ పేరుతో న్యూయార్క్ నగరంలో 19 అంతస్తుల హోటల్ ఉంది. ఇందులో 1,200 గదులు ఉన్నాయి. ఈ హోటల్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సంస్థ యాజమాన్యంలో ఉంది. ఇటీవలే అమెరికా రచయిత జాన్ లెఫెవ్రే సోషల్ మీడియా వేదికగా ఈ హోటల్‌ను విమర్శించారు. ‘‘న్యూయార్క్ నగరంలోని పాకిస్తాన్ హోటల్‌కు బైడెన్ సర్కారు రూ.1860.40 కోట్లు చెల్లించింది. పాక్ దివాలా తీయకుండా ఐఎంఎఫ్‌తో కుదుర్చుకున్న 1.1 బిలియన్ డాలర్ల డీల్‌లో భాగంగానే ఈ పేమెంట్ చేశారేమో. 2020 సంవత్సరం నుంచి ఈ డీల్ కుదిరే వరకు సదరు పాకిస్తాన్ హోటల్ బుకింగ్స్ లేక వెలవెలబోయింది’’ అని రచయిత జాన్ లెఫెవ్రే రాసుకొచ్చారు. దీనికి వివేక్ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దుబారా ఖర్చులను ఆపుతామని ట్రంప్ అంటున్నారు. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో వేచిచూడాలి.