Venezuela Hands Over 50M Barrels Of Oil To USA అంతర్జాతీయ ఇంధన రాజకీయాలను మలుపు తిప్పేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన పావు కదిపారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా ముడి చమురుపై ఆధార పడుతున్న భారత్‌కు.. వాషింగ్టన్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రత్యామ్నాయాన్ని చూపింది. వెనిజులా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్న తర్వాత.. ఆ దేశ చమురు నిల్వలను తన నియంత్రణలోకి తెచ్చుకున్న అమెరికా.. ఆ చమురును భారత్‌కు విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ముడి చమురు సరఫరాకు సంబంధించి అమెరికా ఒక కీలకమైన మలుపు తీసుకుంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులపై.. భారత్ ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఒత్తిడి తెస్తున్న వాషింగ్టన్.. అందుకు ప్రత్యామ్నాయంగా వెనిజులా చమురును విక్రయించేందుకు సిద్ధమని ప్రకటించింది. అమెరికా నియంత్రణలో ఉండే ఒక ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఈ లావాదేవీలు సాగుతాయని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏమిటీ కొత్త వ్యవస్థ?
ఇటీవలే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే ఆ దేశ చమురు నిల్వలపై అమెరికా పట్టు సాధించింది. ఈ క్రమంలో దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన (సుమారు 3 నుంచి 5 కోట్ల బ్యారెళ్లు) ముడి చమురును ప్రపంచవ్యాప్తంగా విక్రయించాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్టోఫర్ రైట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ చమురును అమెరికా ప్రభుత్వమే నేరుగా మార్కెట్ చేస్తుంది. దీని ద్వారా వచ్చే నిధులు ప్రత్యేక ఖాతాల్లోకి వెళ్తాయి. ఆ నిధులను వెనిజులా ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేస్తారు తప్ప.. పాత ప్రభుత్వానికి లేదా అవినీతి శక్తులకు అందకుండా చూస్తారు.
భారత్‌కు కలిగే ప్రయోజనం ఏమిటి?
అమెరికా ఆంక్షలు విధించకముందు.. వెనిజులా నుంచి ముడి చమురును అత్యధికంగా కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ఒకటి. వెనిజులా నుంచి వచ్చే ‘హెవీ క్రూడ్ ఆయిల్’ను శుద్ధి చేసే సామర్థ్యం భారతీయ రిఫైనరీలకు ఉంది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా చమురుపై ఆధార పడటం భారత్‌కు దౌత్యపరంగా కొంత ఇబ్బందిగా మారింది. ఈ తరుణంలో అమెరికా నియంత్రణలో వెనిజులా చమురు అందుబాటులోకి రావడం భారత్‌కు ఒక మంచి అవకాశంగా మారుతుంది. “మీరు చమురును అమెరికాతో కలిసి విక్రయించవచ్చు. లేకపోతే అస్సలే అమ్మలేరు” అంటూ క్రిస్టోఫర్ రైట్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అంటే అమెరికా నిర్దేశించిన పద్ధతుల్లో కాకుండా దొంగచాటుగా చమురు రవాణా చేసే నౌకలపై సైనిక చర్యలు ఉంటాయని ఆయన సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం నిల్వ ఉన్న చమురుతో పాటు భవిష్యత్తులో వెనిజులాలో ఉత్పత్తి అయ్యే చమురును కూడా అమెరికా తన పర్యవేక్షణలోనే విక్రయించనుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశంగా వెనిజులాకు గుర్తింపు ఉంది. ఇప్పుడు అమెరికా నేతృత్వంలో ఈ సరఫరా పునఃప్రారంభం కావడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరపడటంతో పాటు భారత్ వంటి దేశాలకు ఇంధన భద్రత లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
