Israel : ఇజ్రాయెల్ జైళ్లలో వేలాది మంది పాలస్తీనా ఖైదీలు చాలా ఏళ్లుగా మగ్గుతున్నారు. పాలస్తీనాలో నిరసన తెలిపారనే నెపంతో ఎంతోమంది సామాన్య పౌరులను తీసుకొచ్చి తమ దేశ జైళ్లలో ఇజ్రాయెల్ నిర్బంధిస్తోంది. వారి జైళ్లలో తీవ్రంగా వేధిస్తోంది. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ఈక్రమంలోనే తాజాగా ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌లోని తైమన్ మిలిటరీ బేస్ వద్దనున్న జైలులో ఓ పాలస్తీనా ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డారనే అభియోగాలపై తొమ్మిది మంది ఇజ్రాయెలీ సైనికులను ఇటీవల అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అంతర్జాతీయ మీడియాలో దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో అమెరికా స్పందించింది. పాలస్తీనా ఖైదీని సైనికులు లైంగికంగా వేధిస్తున్న వీడియో బయటపడినందున దానిపై జవాబుదారీగా విచారణ చేయాలని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఛానల్ 12లోనే ఈ వీడియోను ప్రసారం చేయడం గమనార్హం. ఓ ఇజ్రాయెలీ సైనికుడు తన చేయిని ప్రైవేటు పార్టు ఉండే భాగం వైపుగా పెట్టుకున్నట్లు ఆ వీడియోలో కనిపించడం కలకలం రేపింది. అందుకే ఒత్తిడికిలోనైన ఇజ్రాయెల్(Israel) ప్రభుత్వం తొమ్మిది మంది సైనికులకు సమన్లు ఇచ్చి, వారిని ఇంటరాగేట్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join
‘‘పాలస్తీనా ఖైదీలపై లైంగిక వేధింపుల వీడియోను మేం చూశాం’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ విలేకరులకు వెల్లడించారు. ‘‘ఖైదీల మానవ హక్కులు అన్ని సందర్భాల్లోనూ గౌరవించబడాలి. ఉల్లంఘనలు జరిగాయి కాబట్టి ఇజ్రాయెల్ ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో జవాబుదారీగా వ్యవహరించాలి’’ అని ఆయన ఇజ్రాయెల్‌కు సూచించారు. సాధ్యమైనంత త్వరగా విచారణను పూర్తి చేసి, దోషులను శిక్షించాలని మాథ్యూ మిల్లర్ కోరారు. మరోవైపు అతివాద ఇజ్రాయెలీ గ్రూపులు మాత్రం తమ దేశ సైనికుల దుశ్చర్యను సమర్ధించుకుంటున్నాయి. హమాస్ మిలిటెంట్లతో అలా ప్రవర్తించడంలో తప్పేం లేదని వాదిస్తుండటం గమనార్హం. మరోవైపు గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్ సరిహద్దు ప్రాంతాలపైనా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో బాంబుదాడులు చేస్తోంది.