US vs Houthi : అమెరికా ఎటాక్.. 10 మంది హౌతీ మిలిటెంట్లు హతం

US vs Houthi : ఎర్ర సముద్రం వేదికగా యుద్ధం మరింత విస్తరిస్తోంది. అమెరికా ఆర్మీ జరిపిన గగనతల దాడుల్లో 10 మంది హౌతీ మిలిటెంట్లు చనిపోయారు.

  • Written By:
  • Updated On - January 1, 2024 / 10:50 AM IST

US vs Houthi : ఎర్ర సముద్రం వేదికగా యుద్ధం మరింత విస్తరిస్తోంది. అమెరికా ఆర్మీ జరిపిన గగనతల దాడుల్లో 10 మంది హౌతీ మిలిటెంట్లు చనిపోయారు. వివరాలలోకి వెళితే.. ఆదివారం తెల్లవారుజామున ఎర్ర సముద్రం మీదుగా వెళ్తున్న మెర్స్క్ హాంగ్‌జౌ కంపెనీకి చెందిన ఒక నౌకను హౌతీ మిలిటెంట్లు మూడు బోట్లలో చుట్టుముట్టారు. దాన్ని హైజాక్ చేసే యత్నం చేశారు. ఆ నౌకలోని భద్రతా సిబ్బంది ప్రతిఘటించడంతో.. హౌతీ మిలిటెంట్లు కూడా కాల్పులు జరిపారు. దీంతో ‘సహాయం కావాలి’ అంటూ మెర్స్క్ హాంగ్‌జౌ కంపెనీ నౌకలోని సిబ్బంది సమీపంలోని అమెరికా యుద్ధనౌకలకు మెసేజ్‌ను పంపించారు. ఈ మెసేజ్‌లు అందిన వెంటనే అమెరికా యుద్ధనౌకలు USS ఐసెన్‌హోవర్, USS గ్రేవ్లీ నుంచి రెండు హెలికాప్టర్‌లను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయినా యెమన్ హౌతీ మిలిటెంట్లు(US vs Houthi) వెనుదిరగలేదు. దీంతో వారిపై హెలికాప్టర్ నుంచి కాల్పులు జరిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ కాల్పుల్లో మూడు బోట్లలోని 10 మంది హౌతీ మిలిటెంట్లు చనిపోయారు. అనంతరం ఆ మూడు బోట్లు కూడా సముద్రంలో మునిగిపోయాయి. అదే సమయంలో హౌతీ  మిలిటెంట్ల రెస్క్యూ కోసం ఓ బోటు యెమన్ తీరం నుంచి వచ్చింది. అయితే అమెరికా ఆర్మీ కాల్పులు కొనసాగుతుండటంతో దూరం నుంచే అది వెనక్కి వెళ్లిపోయింది. హౌతీ మిలిటెంట్లపై అమెరికా ఆర్మీ దాడి నేపథ్యంలో హౌతీలకు చెందిన కీలక నేత ఒకరు ఇరాన్‌కు వెళ్లారు. ఎర్రసముద్రంలో భవిష్యత్ యుద్ధ వ్యూహంపై ఇరాన్ పెద్దలతో ఆయన చర్చిస్తారని తెలుస్తోంది. ఈ దాడి నేపథ్యంలో వచ్చే 48 గంటల పాటు ఎర్ర సముద్రం మీదుగా తమ కంపెనీ నౌకల ప్రయాణాలను రద్దు చేశామని మెర్స్క్ కంపెనీ వెల్లడించింది. యెమన్ యొక్క హౌతీ మిలిటెంట్లు పాలస్తీనాలోని సామాన్య ప్రజలకు మద్దతుగా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నవంబరు నుంచి ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులు చేస్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులను ఆపితేనే తాము ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులను ఆపుతామని హౌతీలు తేల్చి చెబుతున్నారు.

Also Read: Hyderabad Padukas : అయోధ్య రామయ్యకు హైదరాబాద్ పాదుకలు