Site icon HashtagU Telugu

Vladimir Putin: శాంతి వైపు అడుగులు వేయని పుతిన్..!

Putin Agrees To China Visit

Putin

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌ సంక్షోభం ముగింపు దిశగా చర్చల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపకుండా పుతిన్ వ్యతిరేక దిశలో వెళ్తున్నారన్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌లోని ఇంధన వసతులే లక్ష్యంగా రష్యా శనివారం మరిన్ని క్షిపణి దాడులతో విరుచుకుపడింది. దీంతో రాజధాని కీవ్‌తోపాటు పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

రష్యాతో దౌత్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా అన్ని మార్గాలను పరిశీలిస్తుందని, అయితే ప్రస్తుతానికి పుతిన్ ఆ చర్చల్లో పాల్గొనేందుకు సుముఖత చూపడం లేదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. “అర్థవంతమైన దౌత్యంలో పాల్గొనడానికి ఇష్టపడకుండా అధ్యక్షుడు పుతిన్ వ్యతిరేక దిశలో ముందుకు సాగడం ఇందుకు నిదర్శనం” అని బ్లింకెన్ విలేకరుల సమావేశంలో అన్నారు.

ఈనెల ప్రారంభంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ముగించే మార్గాలపై యునైటెడ్ స్టేట్స్ లేదా టర్కీతో నిమగ్నమవ్వడానికి సిద్ధంగా ఉందని, అయితే చర్చల కోసం ఇంకా ఎటువంటి తీవ్రమైన ప్రతిపాదనలను అందుకోలేదని ఆయన చెప్పారు. అయితే.. బ్లింకెన్, ఇతర U.S. అధికారులు రష్యా అర్థవంతమైన దౌత్యం పట్ల ఆసక్తి చూపడం లేదని పదేపదే చెప్తున్నారు.

Exit mobile version