రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు మాటిచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. మా దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే ఇంధన ఎంపికల్లో ప్రాధాన్యం ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేసే దేశాల్లో భారత్ కీలకమైంది. ప్రస్తుత ఇంధన అస్థిర పరిస్థితుల్లో భారత వినియోగదారుల ప్రయోజనాలకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తాం.. భారత దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యంపైనే ఆధారపడి ఉన్నాయి. స్థిరమైన ధరలు, సురక్షిత సరఫరాలను నిర్ధరించడమే మా ప్రధాన లక్ష్యం.. అంతర్జాతీయంగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగడంతో పాటు సప్లయ్ ఛైన్‌ను విస్తరించడానికే మేం అధిక ప్రాధాన్యం ఇస్తాం’ అని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అమెరికా నుంచి చమురు దిగుమతుల గురించి కూడా ప్రస్తావించారు. తన ఇంధన దిగుమతులను విస్తరించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో గడచిన దశాబ్దకాలంలో పురోగతి సాధించామని చెప్పారు. దీనిపై మా అధికార యంత్రాంగం చర్చలు కొనసాగిస్తోందని తెలియజేశారు. అయితే, రష్యా చమురు దిగుమతులను ఆపేస్తామని మోదీ తనకు హామీ ఇచ్చారన్న ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.
అటు, అమెరికా అధ్యక్షుడు ప్రకటనపై మాస్కో సైతం స్పందించింది. భారత ఆర్థిక వ్యవస్థకు రష్యా చమురు దిగుమతులు అత్యంత కీలకమని న్యూఢిల్లీలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు. ఇరుదేశాల కొనసాగుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యం నమ్మకం అనే దృఢమైన పునాదిపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ విధానాలను అవగాహన చేసుకొని తాము ముందుకుసాగుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో భారత్- అమెరికా సంబంధాల్లో తాము జోక్యం చేసుకోబోమని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో భారత్‌తో తమ దీర్ఘకాల బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే భారత్‌పై అదనంగా 25 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో రష్యా చమురు దిగుమతులను ఆపేస్తామని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ అన్నారు.