ఇరవై ఏళ్లుగా చెబుతున్నాం..ఇప్పుడు సమయం వచ్చింది: గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

రెండు దశాబ్దాలుగా అమెరికా సహా మిత్రదేశాలు ఓపికగా ఎదురు చూస్తూనే ఉన్నాయని కానీ ఇకపై ఆలస్యం చేయలేమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పుడు నిర్ణయాత్మక చర్యలు తీసుకునే సమయం వచ్చింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Published By: HashtagU Telugu Desk
US President Donald Trump key post on Greenland

US President Donald Trump key post on Greenland

. నాటో హెచ్చరికలు పట్టించుకోని డెన్మార్క్

. గ్రీన్‌లాండ్ స్వాధీనం ఖాయమంటూ ట్రంప్ ప్రకటన

. వ్యతిరేక దేశాలపై టారిఫ్‌ల దెబ్బ

Donald Trump: గ్రీన్‌లాండ్ విషయంలో గత ఇరవై సంవత్సరాలుగా డెన్మార్క్ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. రష్యా నుంచి భద్రతా ముప్పు పొంచి ఉందని నాటో పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ డెన్మార్క్ ఆ హెచ్చరికలను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ నిర్లక్ష్యమే ఇప్పుడు పరిస్థితి చేయి దాటే స్థాయికి తీసుకువచ్చిందన్నారు. రెండు దశాబ్దాలుగా అమెరికా సహా మిత్రదేశాలు ఓపికగా ఎదురు చూస్తూనే ఉన్నాయని కానీ ఇకపై ఆలస్యం చేయలేమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పుడు నిర్ణయాత్మక చర్యలు తీసుకునే సమయం వచ్చింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

గ్రీన్‌లాండ్‌ను తమ నియంత్రణలోకి తీసుకునే అంశంపై ట్రంప్ తన వైఖరిని మరింత దృఢంగా ప్రకటించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఓ పోస్టు పెట్టిన ఆయన గ్రీన్‌లాండ్ స్వాధీనం తప్పనిసరి అని తేల్చిచెప్పారు. డెన్మార్క్ రష్యా ముప్పును సమర్థంగా ఎదుర్కోలేకపోయిందని అందుకే భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇది ఆక్రమణ కాదు అవసరమైన రక్షణ చర్య మాత్రమేనని ట్రంప్ సమర్థించుకున్నారు. సమయం వచ్చింది కాబట్టే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని పేర్కొంటూ ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో భద్రతను కాపాడటం అమెరికా బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.

గ్రీన్‌లాండ్ అంశంపై తమ వైఖరిని వ్యతిరేకించే దేశాలపై కఠిన చర్యలు తప్పవని ట్రంప్ ముందుగానే హెచ్చరించారు. ఆ హెచ్చరికలకు అనుగుణంగానే యూరోపియన్ యూనియన్ కూటమిలోని ఎనిమిది దేశాలపై 10 శాతం టారిఫ్‌లు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ టారిఫ్‌లు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. అమెరికా భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలిచే దేశాలకు ఆర్థికంగా కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ సందేశం పంపారు. గ్రీన్‌లాండ్ అంశం కేవలం భూభాగానికి సంబంధించినది కాదని ప్రపంచ భద్రతతో ముడిపడి ఉన్న సున్నితమైన విషయం అని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

  Last Updated: 19 Jan 2026, 06:33 PM IST