Site icon HashtagU Telugu

Navy SEALs Dead : అమెరికా నేవీ సీల్స్‌కు హౌతీల షాక్.. ఇద్దరికి ఏమైందంటే?

Navy Seals Dead

Navy Seals Dead

Navy SEALs Dead : ఇరాన్ నుంచి యెమన్‌లోని హౌతీ  మిలిటెంట్లకు ఎర్ర సముద్ర మార్గంలో సప్లై అవుతున్న ఆయుధాలను సీజ్ చేసేందుకు జనవరి 11న అమెరికా నేవీ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. సోమాలియా తీరంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు నేవీ సీల్స్ సముద్రంలో గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం దాదాపు 11 రోజులు గాలించిన అనంతరం అమెరికా నేవీ కీలక ప్రకటన విడుదల  చేసింది. ఆ ఇద్దరు నేవీ సీల్స్(Navy SEALs Dead) చనిపోయారని వెల్లడించింది. ప్రస్తుతం వారిద్దరి డెడ్ బాడీస్ కోసం సముద్రంలో గాలిస్తున్నామని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

అమెరికా, బ్రిటన్ సహా దాదాపు 12 దేశాలు కలిసి ఇటీవల యెమన్‌లోని హౌతీల సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి. హౌతీలు కూడా ఎర్ర సముద్రంలోని ఆయా దేశాల యుద్ధ నౌకలు లక్ష్యంగా క్షిపణి దాడులు, ఆత్మాహుతి డ్రోన్ దాడులు చేస్తున్నారు. ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే వాణిజ్య నౌకల్ని బెదిరిస్తున్నారు. వాటిపైకి  మిస్సైల్స్ ఎక్కుపెడుతున్నారు. దీంతో ఇప్పటికే చాలా షిప్పింగ్ కంపెనీలు ఎర్ర సముద్రం మీదుగా రాకపోకలను నిలిపివేశాయి. కొన్ని కంపెనీలైతే యుద్ధ వాతావరణం సమసిపోయిన తర్వాతే కార్యకలాపాలను ప్రారంభిస్తామని వెల్లడించాయి. ప్రపంచంలో జరిగే సముద్ర ఎగుమతి, దిగుమతుల్లో దాదాపు 12 శాతం నైరుతి యెమెన్ – జిబౌటీ మధ్యనున్న ఎర్ర సముద్రం ప్రవేశ ద్వారమైన బాబ్ అల్-మందబ్  జలసంధి మీదుగా వెళ్తుంటుంది.  ఈ దారిని ఇప్పుడు యెమన్ హౌతీలు అడ్డుకుంటున్నారు. గాజాపై ఇజ్రాయెల్ అమానవీయ దాడులను ఆపేస్తే.. తాము కూడా ఎర్ర సముద్రంలో రెడ్ సిగ్నల్ ఆపేస్తామని హౌతీలు అంటున్నారు. కానీ అమెరికా మాత్రం యుద్ధం చేసే దిశగానే ఇజ్రాయెల్‌ను ప్రోత్సహిస్తోంది. గాజాపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్‌ను నిలువరించే ప్రయత్నం చేయని అమెరికా.. యుద్ధాన్ని ఆపాలనే డిమాండ్‌తో సముద్రంలో నౌకలను అడ్డుకుంటున్న యెమన్ హౌతీలపై యుద్ధాన్ని ప్రకటించడం గమనార్హం.

Also Read: Convicts Surrendered : 11 మంది సరెండర్.. లొంగిపోయిన బిల్కిస్ బానో కేసు దోషులు

హమాస్‌ మిలిటెంట్ల అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తోన్న దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మూడున్నర నెలలుగా సాగుతోన్న ఈయుద్ధంలో ఇప్పటివరకు 25 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందినట్లు గాజా ఆరోగ్య విభాగం  వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో 178 మంది మరణించగా.. 300 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలిపింది. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు ఐక్యారాజ్య సమితి పేర్కొంది. ‘అక్టోబర్‌ 7 నుంచి ఇప్పటి వరకు 25,105 మంది పాలస్తీనియన్లు  ప్రాణాలు కోల్పోయారు. మరో 62,681 మంది గాయాలపాలయ్యారు. అనేక ప్రాంతాల్లో శిథిలమైన భవనాల కింద ఎంతో మంది చిక్కుకుపోయారు. వారు విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు’ అని గాజా ఆరోగ్య విభాగం అధికార ప్రతినిధి అష్రాఫ్‌ అల్‌-కిద్రా పేర్కొన్నారు. చనిపోయిన వారిలో హమాస్‌ మిలిటెంట్లు, సాధారణ పౌరులు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే, ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకారం దాదాపు 9వేల మంది హమాస్‌ మిలిటెంట్లు హతమైనట్లు సమాచారం.

Exit mobile version