Donald Trump: మ‌ళ్లీ అధ్య‌క్ష బ‌రిలోకి ట్రంప్‌?

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో కీలక ప్రకటన చేయనున్నారు

  • Written By:
  • Updated On - November 9, 2022 / 03:08 PM IST

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో కీలక ప్రకటన చేయనున్నారు. ‘ఈ నెల 15న ఫ్లోరిడాలో అతిపెద్ద ప్రకటన చేయబోతున్నా..’ అని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఒహాయోలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన ఈ మేరకు వెల్లడించారు. ట్రంప్ మరో పర్యాయం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాడంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ట్రంప్ గత అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన ట్రంప్ దూకుడుగా వెళుతూ ప్రపంచ రాజకీయాలపై తనదైన ముద్రవేశారు. ఓటమిపాలైన తర్వాత ట్రంప్ అప్పుడప్పుడు రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ ఉనికి చాటుకుంటున్నారు. ఇప్పుడు ఫ్లోరిడాలో చేయబోయే ప్రకటన వచ్చే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినదే అయ్యుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు అమెరికా సాధార‌ణ ఎన్నిక‌ల‌కు బాట వేసే అవ‌కాశం ఉంది. 2024లో జ‌రిగే సాధార‌ణ‌ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్య‌క్ష పదవికి పోటీ చేసేదెవరో మధ్యంతర ఎన్నికల ఫలితాలు క్లూ ఇవ్వడానికి అవ‌కాశం ఉంది. ట్రంప్ మద్దతు ఉన్న అభ్యర్థులకు సరిగా ఓట్లు రాకపోతే, వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నిలబడేందుకు ట్రంప్‌కు రిపబ్లికన్ పార్టీ మద్దతు ఇవ్వకపోవచ్చు. ఫ్లోరిడా, టెక్సాస్‌లలో రిపబ్లికన్ గవర్నర్‌లు రాన్ డిసాంటిస్, గ్రెగ్ అబాట్ ఈసారి కూడా ఎన్నికైతే వైట్ హౌస్ వైపు అడుగులు వేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు.మిషిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాలో డెమోక్రాట్‌లు అధికారాన్ని నిలబెట్టుకోగలిగితే, 2024 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌కు ప్రచారం కల్పించేందుకు విశ్వాసం కూడగట్టుకోగలుగుతారు.