US – Israel – 1 Lakh Crores : అక్టోబరు 7 నుంచి పాలస్తీనాలోని గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా రూ.లక్ష కోట్ల (14.3 బిలియన్ డాలర్ల) సైనిక సహాయ ప్యాకేజీని ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు రూపొందించిన ప్రతిపాదనకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 10వేల మంది పౌరులు మరణించారు. చనిపోయిన వారిలో సగం మంది పిల్లలే ఉన్నారు. దాదాపు 20వేల మందికి గాయాలయ్యాయి. అయినా ఇజ్రాయెల్‌కు మరో లక్ష కోట్ల రూపాయల సైనిక సహాయ ప్యాకేజీని అమెరికా ప్రకటించడంపై ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రకంగా అమెరికా అందిస్తున్న ప్రోత్సాహం.. యుద్ధాన్ని మరింత పెంచి పోషిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు ఇజ్రాయెల్‌కు చేదోడు అందిస్తుండటం అమెరికాకు వికటిస్తోంది. పశ్చిమాసియాలోని కువైట్, బహ్రయిన్, ఇరాక్, సౌదీ అరేబియా, సిరియాలలోని అమెరికా సైనిక స్థావరాలపైకి ఇరాన్ సపోర్ట్ కలిగిన మిలిటెంట్ గ్రూపుల దాడులు గత పదిరోజుల్లో తీవ్రతరం అయ్యాయి. ఈవిషయాన్ని స్వయంగా అమెరికా వైట్ హౌస్ అంగీకరించింది. కాగా, ఇజ్రాయెల్‌కు రూ.లక్ష కోట్ల సైనిక సాయం ప్రతిపాదనకు సెనేట్‌లో కొంత అడ్డంకి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. అయితే దాన్ని అధిగమించేందుకు బైడెన్ సర్కారు శాయశక్తులు ఒడ్డుతారని అంటున్నారు. అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్‌కు ఏటా దాదాపు రూ.27వేల కోట్ల సైనిక సహాయాన్ని అందిస్తోంది.