Site icon HashtagU Telugu

US-China trade war: అమెరికాకు త‌ల‌వ‌చ్చిన‌ చైనా..! ప్ర‌తీకార సుంకాల‌పై ట్రంప్‌న‌కు కీల‌క విజ్ఞ‌ప్తి

Us China Trade War

Us China Trade War

US-China trade war: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భార‌త్‌, చైనా స‌హా ప‌లు దేశాల ఉత్ప‌త్తుల‌పై ఇటీవ‌ల‌ ప్రతీకార సుంకాలను విధించిన విష‌యం తెలిసిందే. అయితే, ట్రంప్ నిర్ణ‌యంపై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో ప్ర‌తీకార సుంకాల‌ను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, చైనా ఉత్ప‌త్తుల‌పై మాత్రం ప్ర‌తీకార సుంకాల‌ను పెంచారు. దీంతో చైనా ప్ర‌భుత్వం సైతం త‌మ దేశంలో దిగుమ‌తి అవుతున్న అమెరికా ఉత్ప‌త్తుల‌పై భారీ స్థాయిలో ప్ర‌తీకార సుంకాల‌ను పెంచింది. దీంతో చైనా వ‌ర్సెస్ అమెరికా దేశాల‌ మ‌ధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. అయితే, తాజాగా.. చైనా టారిఫ్ ల విష‌యంపై వెన‌క్కు త‌గ్గేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

Read Also: Tamil Nadu: మ‌రో వివాదంలో త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్.. డీఎంకే, కాంగ్రెస్ విమ‌ర్శ‌లు

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధంపై రెండు అగ్ర‌రాజ్యాలైన అమెరికా, చైనాలు ముఖాముఖీ త‌ల‌ప‌డుతున్నాయి. అయితే, చైనా తాజాగా అమెరికాకు కీల‌క విజ్ఞ‌ప్తి చేసింది. వాస్త‌వానికి ట్రంప్ టారిఫ్ ల‌పై తొలుత చైనా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అమెరికాకు దీటుగా ప్ర‌తీకార సుంకాల‌ను పెంచుకుంటూ పోయింది. కానీ, క్రమంగా చైనా వైఖరిలో మార్పు వ‌స్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. తాజా పరిణామాల నేప‌థ్యంలో చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. పరస్పర సుంకాలను పూర్తిగా రద్దు చేయాలని అమెరికాకు విజ్ఞప్తి చేసింది. “అమెరికా తన తప్పులను సరిదిద్దుకోవడానికి, పరస్పర సుంకాల తప్పుడు పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలి. పరస్పర గౌరవం ఇరు దేశాల‌కు మంచి మార్గం. తిరిగి ఆ వాతావ‌ర‌ణం నెల‌కొల్పేందుకు అమెరికా అడుగు వేయాలని కోరుతున్నాం” అని చైనా వాణిజ్య‌ మంత్రిత్వ శాఖ ప్రతినిధిని తెలిపారు.

Read Also:  TTD Chairman BR Naidu: టీటీడీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర జ‌రుగుతోంది: చైర్మ‌న్ బీఆర్ నాయుడు

“పులి మెడలో కట్టిన గంటను దానిని కట్టిన వ్యక్తి మాత్రమే తెరవగలడు” అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సుంకాల విషయంలో ట్రంప్ పరిపాలన తన విధానాన్ని సరిదిద్దుకోవాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. చైనా అమెరికన్ వస్తువులపై సుంకాన్ని 84 శాతం నుండి 125 శాతానికి పెంచింది, అయితే అమెరికా చైనా ఉత్పత్తులపై సుంకాన్ని మొత్తం 145 శాతానికి పెంచింది. ట్రంప్ ఏకపక్ష విధానం, ఆర్థిక బెదిరింపులకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాలని ఇతర దేశాలకు చైనా పిలుపునిచ్చింది. భార‌త స‌హా ఇత‌ర దేశాల‌తో వాణిజ్యాన్ని పెంచుకోవాల‌ని ప్రయత్నించింది.