39 Killed : అమెరికా ఎటాక్.. ఇరాక్, సిరియాలలో 39 మంది మృతి

39 Killed : అమెరికా తన ఆయుధ సంపత్తితో రియాక్షన్ చూపించడం మొదలుపెట్టింది.

  • Written By:
  • Updated On - February 4, 2024 / 08:03 AM IST

39 Killed : అమెరికా తన ఆయుధ సంపత్తితో రియాక్షన్ చూపించడం మొదలుపెట్టింది. జనవరి 28న జోర్డాన్‌లోని మిలిటరీ బేస్‌పై జరిగిన సూసైడ్ డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించిన ఘటనకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఇరాక్, సిరియాలపై శనివారం తెల్లవారుజామున భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 39కి(39 Killed) పెరిగింది. సిరియాలో 23 మంది చనిపోగా, ఇరాక్‌లో 16 మంది చనిపోయారు.  ఇరాక్‌లోని  85కు పైగా ఇరాన్ మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేశామని అమెరికా ప్రకటించింది. వాటిపై 125కు పైగా బాంబులను వేసినట్లు వెల్లడించింది. ఇరాన్ మిలిటెంట్ల స్థావరాలు, ఇరాన్ సపోర్ట్ కలిగిన కమాండ్ కంట్రోల్ సెంటర్లు,  నిఘా కేంద్రాలు, మిలిటెంట్లకు చెందిన రాకెట్లు, క్షిపణులు, డ్రోన్ల నిల్వ కేంద్రాలు, ఆయుధ వ్యవస్థలను ధ్వంసం చేశామని తెలిపింది. ఈ దాడుల కోసం దీర్ఘశ్రేణి బీ-1 బాంబర్లను అమెరికా వాయుసేన వినియోగించింది.  ఈ వైమానిక దాడులు ఆరంభం మాత్రమేనని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టీన్‌ స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఇరాక్ ప్రభుత్వ ప్రతినిధి బస్సిమ్ అల్-అవాడి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సిరియా సరిహద్దు సమీపంలోని ఇరాక్‌ భూభాగంలో అమెరికా జరిపిన దాడుల్లో 16 మంది చనిపోయారు. వారిలో సామాన్య  పౌరులు కూడా ఉన్నారు. ఈ దాడిలో  ప్రజల ఇళ్లు, ప్రైవేట్ ఆస్తులకు గణనీయమైన నష్టం జరిగింది. ఇరాకీ సార్వభౌమాధికారాన్ని అమెరికా ఉల్లంఘించింది’’ అని తెలిపారు.  ఇరాక్‌లోని ఇరాన్ మద్దతు కలిగిన మిలీషియాలలో ఒకటైన హర్కతుల్ నుజాబా ప్రతినిధి హుస్సేన్ అల్-మొసావి మాట్లాడుతూ.. ‘‘అమెరికా దాడులు సరికాదు. అమెరికా చేస్తున్న ప్రతీ సైనిక చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మేం ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచాలని కోరుకోవడం లేదు. ఇరాక్‌లో స్థావరాలపై అమెరికా దాడులు జరిపిన ప్రాంతాల్లో మా మిలిటెంట్ గ్రూపు సభ్యులెవరూ లేరు’’ అని చెప్పారు. ఇక ఇరాక్,సిరియాలలో అమెరికా దాడులను పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోగా మరింత ఎక్కువవుతాయని హెచ్చరించింది.

Also Read : 46 Dead : అగ్నివిలయానికి 46 మంది బలి.. కాలి బూడిదైన 1100 ఇళ్లు

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు పెరిగాయి. అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు అరబ్ దేశాలలోని అమెరికా మిలిటరీ బేస్‌లపై 160 దాడులు జరిగాయి. ప్రత్యేకించి ఇరాక్, సిరియా, జోర్డాన్‌లలోని అమెరికా మిలిటరీ బేస్‌లు ఈ దాడులతో బాగా ప్రభావితమయ్యాయి.  రాకెట్లు, వన్-వే అటాక్ డ్రోన్‌లతో ఈ దాడులను మిలిటెంట్లు చేపట్టారు. ఈక్రమంలోనే జోర్దాన్‌లో రహస్యంగా అమెరికా నడుపుతున్న మిలిటరీ బేస్‌పైనా డ్రోన్ దాడి జనవరి 28న జరిగింది.