Site icon HashtagU Telugu

Ukraine: పుతిన్‌ హత్యకు ఉక్రెయిన్‌ కుట్ర?!

Ukraine Conspiracy To Kill Putin

Ukraine's Conspiracy To Kill Putin

Ukraine : ఉక్రెయిన్‌పై రష్యా సంచలన ఆరోపణలు చేసింది. తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేసేందుకు జెలెన్‌స్కీ కుట్ర చేశారని తెలిపింది. మాస్కోలో పుతిన్ నివసించే అధ్యక్ష భవనంపై (క్రెమ్లిన్) పై ఉక్రెయిన్‌కు చెందిన రెండు మానవ రహిత డ్రోన్లు దాడి చేసేందుకు యత్నించగా.. రాడార్ వ్యవస్థతో గుర్తించి వాటిని తమ సైన్యం కూల్చేసిందని వెల్లడించింది. దీన్ని ఒక ఉగ్రవాద చర్యగా రష్యా అభివర్ణించింది. విక్టరీ డే సందర్భంగా విదేశీ ప్రతినిధులతో మే 9న తాము నిర్వహించబోయే పరేడ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి ఉక్రెయిన్ కుట్ర చేసిందని వివరించింది.

ఉక్రెయిన్‌ (Ukraine) డ్రోన్ల దాడిలో పుతిన్‌కు ఎలాంటి హాని జరగలేదని.. ఆ టైంలో ఆయన క్రెమ్లిన్‌లో లేరని, నోవో ఒగర్యోవో నివాసం నుంచి పనిచేస్తున్నారని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. అధ్యక్ష భవనాలు కూడా దెబ్బతినలేదన్నారు. డ్రోన్ దాడికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. సరైన సమయంలో దీటుగా స్పందిస్తామని కామెంట్ చేశారు. డ్రోన్ల దాడి కలవరం సృష్టించినప్పటికీ మే 9 మాస్కోలో విక్టరీ డే పరేడ్‌ యథావిధిగా జరుగుతుందన్నారు. ఈ దాడి నేపథ్యంలో మాస్కోలో డ్రోన్ల వినియోగంపై బ్యాన్ విధిస్తున్నట్లు నగర మేయర్‌ సెర్గీ సోబ్యానిన్ ప్రకటించారు. డ్రోన్ల దాడి ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రోన్లను రష్యా ఆర్మీ కూల్చేసిన తర్వాత క్రెమ్లిన్ ప్యాలెస్ వెనుక పొగలు పైకి లేస్తున్న దృశ్యాలు ఆ వీడియోల్లో కనిపించాయి.

అధ్యక్ష భవనం గోపురం మీదుగా వెళ్తున్న డ్రోన్‌లలో ఒకదాన్ని రష్యా ఆర్మీ కూల్చేయడం ఇంకో వీడియోలో కనిపించింది. 2.7 కోట్ల మంది సోవియట్ యూనియన్ దళాలు జీవితాలను పణంగా పెట్టి హిట్లర్ నాజీలను తిప్పికొట్టిన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రష్యా రాజధాని మాస్కోలో ఏటా మే 9 విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తుంటారు.

చేయబోయే దాడులను సమర్థించుకోవడానికే ఈ ఆరోపణలు : ఉక్రెయిన్‌

రష్యా అధ్యక్ష భవనంపై జరిగిన డ్రోన్ల దాడి ఘటనపై ఉక్రెయిన్‌ స్పందించింది. దానితో తమకు సంబంధం లేదని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేసింది. అలా చేయడం వల్ల ఉక్రెయిన్‌కు ఎటువంటి ప్రయోజనం లేదని.. రష్యా మరింతగా దాడులు చేసేందుకు ఇలాంటి చర్యలు దారితీస్తాయని తెలిపింది. రాబోయే రోజుల్లో చేయనున్న మరిన్ని దాడులను సమర్థించుకోవడానికే రష్యా తమపై ఇటువంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. ఈ పరిణామాలను చూస్తుంటే ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో దాడి చేసేందుకు రష్యా సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోందని జెలెన్‌స్కీ సలహాదారు మైకిలో పొదొల్యాక్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రస్తుతం ఫిన్లాండ్‌ పర్యటనలో ఉన్నారు.

Also Read:  Jai Bajrang Bali: ఓటేసే టప్పుడు “జై బజరంగ్ బలి” అనండి : ప్రధాని మోడీ