Russia-Ukraine war: పాపం ఉక్రెయిన్‌..! నోవా క‌ఖోవ్కా డ్యామ్ పేల్చివేత‌.. ర‌ష్యా ప‌నేన‌న్న జెలెన్ స్కీ.. అంత‌లేద‌న్న ర‌ష్యా

ఉక్రెయిన్‌(Ukraine)లో ర‌ష్యా(Russia) ఆక్ర‌మించుకున్న సిటీలోని నోవా క‌ఖోవ్కా డ్యామ్‌(Nova Kakhovka Dam)ను పేల్చివేశారు.

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 09:30 PM IST

ఉక్రెయిన్‌(Ukraine)లో ర‌ష్యా(Russia) ఆక్ర‌మించుకున్న సిటీలోని నోవా క‌ఖోవ్కా డ్యామ్‌(Nova Kakhovka Dam)ను పేల్చివేశారు. నీప‌ర్ న‌దిపై ద‌క్షిణ ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్ కు 30 కిలో మీట‌ర్ల దూరంలో ఈ డ్యామ్ ఉంది. ఈ డ్యామ్ వ్యూహాత్మ‌కంగా ఉక్రెయిన్‌కు చాలా కీల‌క‌మైంది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున ఈ డ్యామ్‌ను పేల్చివేయ‌డంతో భారీగా వ‌ర‌ద‌నీరు దిగువ‌కు పోటెత్తింది. దీంతో దాదాపు 300 కుటుంబాల‌ను వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. అయితే, ఈ డ్యామ్ ను ర‌ష్యానే కూల్చివేసింద‌ని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నీరు, క్షిప‌ణులు, ఎలాంటి దాడుల‌తోనైనా ఉక్రెయిన్ పోరాటాన్ని ర‌ష్యా సైన్యం ఆప‌లేద‌ని, ఉక్రెయిన్‌లో ఉన్న ర‌ష్యా సైన్యాన్ని త‌రిమికొడ‌తామ‌ని జెలెన్ స్కీ అన్నారు.

నోవా క‌ఖోవ్కా ఆన‌క‌ట్ట కూల్చివేత‌లో త‌మ ప్ర‌మేయం లేద‌ని ర‌ష్యా తేల్చిచెప్పింది. ఇదంతా ఉగ్ర‌కుట్ర అని తెలిపింది. ఈ విష‌యాన్ని స్థానిక ర‌ష్యా మేయ‌ర్ వ్లాదిమిర్ లియోనేటివ్ తెలిపారు. అర్థ‌రాత్రి రెండు గంట‌ల నుంచి డ్యామ్ పై వ‌రుస‌గా దాడులు జ‌రుగుతున్నాయ‌ని, ఆ దాడుల‌కు ఆన‌క‌ట్ట కూలిపోయింద‌ని తెలిపారు. అయితే, ఖెర్సాన్ లో లోత‌ట్టు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయాల‌ని ఆదేశాలు ఇచ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ముఖ్యంగా డ్యామ్ కింద ప్రాంతాలైన మైఖోలావిక‌, లివో, టియాంగికా, ఓల్హిక‌, పోనియాటివ్కా, టోక‌రివ్కా వంటి గ్రామాల‌ను ఖాళీ చేయాల‌ని సూచించిన‌ట్లు వ్లాదిమిర్ లియోనేటివ్ తెలిపారు.

క‌ఖోవ్కా డ్యాంను 1956లో జ‌ల‌విద్యుత్ కేంద్రంలో భాగంగా నిర్మించారు. ఈ రిజ‌ర్వాయ‌ర్ లో 18 క్యూబిక్ కిలో మీట‌ర్ల నీటిని నిల్వ ఉంచే సామ‌ర్థ్యం ఉంది. ఈ డ్యామ్ 30 మీట‌ర్ల ఎత్తు, వంద‌ల మీట‌ర్ల పొడ‌వు ఉంటుంది. ఇది గ్రేట్ సాల్ట్ లేక్‌లోని నీటికి స‌మానం. గ‌తేడాది అక్టోబ‌ర్ లో ఈ డ్యామ్‌ను ర‌ష్యా సైన్యం నుంచి ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ డ్యామ్ పేల్చివేత‌తో ఉక్రెయిన్‌లో విద్యుత్ క‌ష్టాలు మ‌రింత పెర‌గ‌నున్నాయి. డ్యామ్ ఆన‌క‌ట్ట కూలి నీటి ప్ర‌వాహం దిగువ‌కు వెళ్తున్న వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

 

Also Read : Russia-Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మరోసారి వైమానిక దాడులు.. ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు మృతి