Site icon HashtagU Telugu

UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో ముందున్న లిజ్ ట్రస్.. రిషి సునాక్‌కూ అవకాశం

Rishi Imresizer

Rishi Imresizer

బ్రిటన్ లో కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక పోటీ చివరి దశకు చేరింది. ఆ పార్టీ నేతగా ఎవరు నెగ్గితే వారే బ్రిటన్ ప్రధాన మంత్రి అవుతారు. కన్జర్వేటివ్ పార్టీ నేత ఎంపికకు జరిగే పోటీలో భారత సంతతి నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్ తాజా సమాచారం ప్రకారం కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది. లిజ్ ట్రస్ పోటీలో ముందున్నట్లు తాజా సర్వే సమాచారం. ఒపినియన్ సంస్థ 570 మంది కన్జర్వేటివ్ సభ్యుల అభిప్రాయాలను సేకరించింది. వారిలో లిజ్ ట్రస్ కు 61 శాతం మంది, రిషిసునాక్‌కు 39 శాతం మద్దతు లభించింది.

అయితే, ఇప్పటికీ రిషి సునాక్‌కు పార్టీ నేతగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ సీనియర్ సభ్యులు ట్రస్ కు మద్దతు పలుకుతుండగా, సునాక్ కు యువనేతలు మద్దతు పలుకుతున్నట్లు తాజా సర్వేల ద్వారా తెలుస్తోంది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌‌ను రాజీనామా చేయమని సునాక్ కోరడం ఆయనకుప్రతికూల అంశంగా పరిణమించినట్లు భావిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు సెప్టెంబరు 2 వరకూ గడువు ఉంది. 5న తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. ఆ పార్టీ నేతగా ఎన్నికైన వ్యక్తి అదే రోజు బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

1980 మే, 12న జన్మించిన రుషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ తరపున 2015లో రిచ్‌మండ్ (యార్క్స్) పార్లమెంటు సభ్యుడు (ఎంపీ)గా ఎన్నికయ్యారు.2019 నుండి 2020 వరకు ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2020 నుండి 2022 వరకు ఆర్థిక మంత్రిగా పని చేశారు. రిషి సునాక్ తండ్రి యశ్ వీర్ పంజాబ్ కు చెందిన డాక్టర్. 1960లో ఆయన ఇంగ్లాండ్ వలస వెళ్లారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునాక్ పెళ్లాడిన విషయం తెలిసిందే.