. గ్రీన్‌లాండ్ అంశంలో అమెరికా అధ్యక్షుడి వైఖరిపై తీవ్ర విమర్శలు
. పొగడ్తలు, ఖరీదైన కానుకలతోనే సంతృప్తి?
. టారిఫ్ యుద్ధం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తనపై యూకే పార్లమెంట్ సభ్యుడు, లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ నేత ఎడ్ డేవీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ అవలంబిస్తున్న విధానాన్ని ఆయన కఠినంగా తప్పుబట్టారు. ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాలకు నాయకత్వం వహించాల్సిన అధ్యక్షుడిలా కాకుండా బలప్రయోగంతో తనకు కావలసినదాన్ని సాధించాలనుకునే గ్యాంగ్‌స్టర్‌లా వ్యవహరిస్తున్నారని డేవీ ఆరోపించారు. యూకే పార్లమెంట్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
యూకే పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఎడ్ డేవీ ట్రంప్‌ను తీవ్ర పదజాలంతో విమర్శించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కాకుండా అంతర్జాతీయ రౌడీలా ప్రవర్తిస్తున్నారు. తనకు నచ్చినది దక్కించుకోవడానికి బలప్రయోగం, బెదిరింపులు, ఆర్థిక ఒత్తిడిని ఆయుధాలుగా వాడుతున్నారు అని వ్యాఖ్యానించారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ఆలోచన అంతర్జాతీయ చట్టాలకు దేశాల సార్వభౌమత్వానికి పూర్తిగా విరుద్ధమని డేవీ అన్నారు. అమెరికా చరిత్రలోనే ట్రంప్ అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడిగా మిగిలిపోతారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య విలువలు, దౌత్య పరమైన మర్యాదలను పక్కనపెట్టి, వ్యక్తిగత అహం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రపంచానికి ప్రమాదకర సంకేతమని హెచ్చరించారు.
ట్రంప్ అహాన్ని శాంతింపజేయాలంటే ముందుగా ఆయనను నిరంతరం పొగడాలని, ఖరీదైన బహుమతులు ఇవ్వాలని ఎద్దేవాగా వ్యాఖ్యానించారు ఎడ్ డేవీ. ప్రపంచం మొత్తం తనను మెచ్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నాడని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ప్రైవేట్ జెట్‌ల వంటి విలాసవంతమైన కానుకలు, క్రిప్టో ఖాతాల్లో భారీ పెట్టుబడులు పెట్టితేనే ట్రంప్ సానుకూలంగా స్పందిస్తారని విమర్శించారు. ఇది ఒక ప్రజాస్వామ్య దేశాధ్యక్షుడికి తగిన ప్రవర్తనా? అని డేవీ ప్రశ్నించారు. నాయకత్వం అంటే ప్రశంసల మీద ఆధారపడటం కాదని బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ వ్యవహారం వ్యక్తిగత లాభాలు అహంకారంతో నడుస్తోందని ఆరోపించారు.
గ్రీన్‌లాండ్ అంశంలో అమెరికా వైఖరిని విమర్శించిన దేశాలపై టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ బెదిరించడం అత్యంత ప్రమాదకరమని ఎడ్ డేవీ అన్నారు. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ దేశాలపై విధించిన సుంకాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ టారిఫ్ యుద్ధం కారణంగా అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కుదేలై, లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా సరే ఈ పరిణామాలన్నిటిని పట్టించుకోకుండా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ట్రంప్ మాట్లాడడం సరైనది కాదని డేవీ అన్నారు. ఎవరేమన్నా, ఏదైనా జరిగినా నాకు కావలసిందే కావాలి అనే ధోరణి ప్రజాస్వామ్యంలో రౌడీయిజమేనని తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచ శాంతి ఆర్థిక స్థిరత్వం కోసం బాధ్యతాయుత నాయకత్వం అవసరమని కానీ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేయడం లేదని ఎడ్ డేవీ స్పష్టం చేశారు.
Trump is acting like an international gangster.
The Prime Minister has tried appeasing him for 12 months and has failed. It's time we finally stood up to him and united with our European allies to make him back down. pic.twitter.com/9T4y5uQhhm
— Ed Davey (@EdwardJDavey) January 19, 2026
