Iran Arrests Two Actresses: ఇరాన్‌లో ఇద్దరు హీరోయిన్లు అరెస్ట్‌.. ఎందుకంటే..?

ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక నిరసనకారులపై అణిచివేత కొనసాగుతుంది.

Published By: HashtagU Telugu Desk
Cropped (1)

Cropped (1)

ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక నిరసనకారులపై అణిచివేత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ప్రముఖ హీరోయిన్లు హెంగమెహ్ ఘజియానీ, కటయోన్ రియాహిలను హిజాబ్‌ తీసి కనిపించడం కలకలం సృష్టించింది. పబ్లిక్‌గా వారు హిజాబ్‌ను తొలగించడంతో ఇరాన్ ప్రభుత్వం వారిని అరెస్ట్‌ చేసింది. సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగా అరెస్ట్‌ చేసినట్టు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీంతో వారి అరెస్ట్‌ వివాదాస్పదంగా మారింది.

ప్రముఖ ఇరాన్ నటీమణులు హెంగామెహ్ ఘజియాని, కటయోన్ రియాహిలను అరెస్టు చేశారు. నిరసనకారులకు సంఘీభావంగా ఇద్దరు నటీమణులు హిజాబ్‌ లేకుండా బహిరంగంగా కనిపించారు. అరెస్టుకు ఒక రోజు ముందు ఘజియానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హిజాబ్ లేకుండా వీడియోను పోస్ట్ చేసింది. ఏం జరిగినా.. తాను ఎల్లప్పుడూ ఇరాన్ ప్రజలకు అండగా ఉంటానని చెప్పింది. ఈ నెల ప్రారంభంలో ఇరాన్ అగ్ర నటీమణులలో ఒకరైన తరనేహ్ అలిదోస్తీ కూడా హిజాబ్ లేకుండా ఒక చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆమె చేతిలో ‘మహిళలు, జీవితం, స్వేచ్ఛ’ అనే నినాదంతో కూడిన ప్లకార్డును పట్టుకున్నారు.

కఠినమైన హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 22 ఏళ్ల మహ్సా అమినీని అనే మహిళను రాజధాని టెహ్రాన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల తరువాత సెప్టెంబర్ 16న పోలీసు కస్టడీలో మరణించింది. అప్పటినుండి దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. భద్రతా దళాల హింసాత్మక అణిచివేతలో 400 మంది నిరసనకారులు మరణించారు. 16,800 మంది ఇతరులు అరెస్టయ్యారు. ఐదుగురు నిరసనకారులకు మరణశిక్ష విధించారు. ఆదివారం ఖతార్‌లో ప్రారంభమైన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ ఎహ్సాన్ హజ్సాఫీ మాట్లాడుతూ.. ‘మన దేశంలో పరిస్థితి బాగా లేదని, మన ప్రజలు సంతోషంగా లేరని మనం అంగీకరించాలి’ అని అన్నారు.

  Last Updated: 21 Nov 2022, 07:30 PM IST