Robbery: సినిమాలకు మించిన ట్విస్ట్: డబ్బు కొట్టేసి, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని పరార్!

సినిమాల్లో మామూలుగా మనం మారువేషాలు వేసుకునే వారిని చూసి ఆశ్చర్యపోతుంటాం. రూపం మార్చి అందరి కంట్లో కారం కొట్టే వాళ్లను చూసి అరె వాహ్ అని అనుకుంటూ ఉంటాం.

  • Written By:
  • Publish Date - January 23, 2023 / 09:27 PM IST

Robbery:  సినిమాల్లో మామూలుగా మనం మారువేషాలు వేసుకునే వారిని చూసి ఆశ్చర్యపోతుంటాం. రూపం మార్చి అందరి కంట్లో కారం కొట్టే వాళ్లను చూసి అరె వాహ్ అని అనుకుంటూ ఉంటాం. అయితే నిజ జీవితంలో కూడా ఇలా రూపాలు మార్చే వాళ్లు ఉంటే, అది కూడా బ్యాంకుకు సున్నం పెట్టి, డబ్బు కొట్టేస్తే ఎలా ఉంటుంది? అవును ఇలాంటి సీనే ఒకటి చైనాలో జరిగింది. ఓ కిలాడీ లేడీ ఆడిన గేమ్ చివరకు పోలీసులకు తెలిసిపోయింది.

చైనాకు చెందిన చెన్ వైల్ అనే మహిళ 1997లో యెకింగ్ లోని చైనా కన్ స్ట్రక్షన్ బ్యాంక్ లో క్లర్క్ గా పని చేస్తున్న టైంలో బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాన్ని గుర్తించింది. ఆ లోపాన్ని గుర్తించిన సదరు మహిళ.. ఓ భారీ స్కెచ్ వేసింది. నగదును విత్ డ్రా చేసుకునే ముందు డబ్బు మొత్తాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు గ్రహించిన ఆ మహిళ.. దానిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంది.

బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చిన లోపాన్ని వాడి తన ఖాతాలో మొత్తం డబ్బును ఎడిట్ చేసి, తనకు కావాల్సినంత జత చేసి, దానిని ఉపసంహరించుకోవాలనుకుంది. అందుకు తగ్గట్టుగానే భారీగా ఆ మహిళ డబ్బును తన ఖాతాకు మళ్లించడంతో పాటు దానిని విత్ డ్రా కూడా చేసుకుంది. ఆ తర్వాత వెంటనే ఆమె ఆస్పత్రికి వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని, తన రూపు రేఖలు మార్చుకుంది. అయితే ఈ వ్యవహారం మీద పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు నమోదు చేసి, విచారణ మొదలుపెట్టారు.

అయితే డబ్బుతో ఆ ప్రాంతం నుండి ఉడాయించిన కిలాడీ లేడీ.. వేరే ప్రావిన్సుకు వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అప్పటికే ఆమెకు పెళ్లి కాగా.. కొత్త రూపం వచ్చాక మరో పెళ్లి చేసుకుంది. భర్త, ఓ పాపతో ఆనందంగా ఉన్న ఆమె.. ఏకంగా ఓ వ్యాపారవేత్తగా ఎదిగింది. కానీ పోలీసులు మాత్రం ఆ కేసును వదలకుండా విచారించడంతో.. చివరకు 25 ఏళ్ల తర్వాత ఆమె గుట్టు తెలిసిపోయింది. ఆమెను పోలీసులు అరెస్టు చేయగా.. ఆమె రెండో భర్తకు ఈ విషయాలు ఏమీ తెలియకపోవడం విశేషం.