అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న కీలక నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనా, రష్యా వంటి దేశాలపై దిగుమతి సుంకాలు (Rrump Tariffs) విధించిన ట్రంప్.. తాజాగా భారత్ పై కూడా అలాంటి హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు 1నుంచి 20 నుంచి 25 శాతం వరకూ దిగుమతి సుంకాలు విధించవచ్చని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనను స్కాట్లాండ్ నుంచి అమెరికా తిరిగివస్తూ ఆయన చేసిన విషయమై అంతర్జాతీయంగా చర్చ జోరందుకుంది.
భారత్ మంచి మిత్ర దేశమే అయినా అధిక సుంకాలు విధించడం ద్వారా అమెరికాకు అనుకూలంగా ఆర్ధిక సమీకరణాల్ని మార్చాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, ఇప్పటికే కొన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ భారత్ విషయంలో మాత్రం మరికొంత సమయం అవసరమని అమెరికా ట్రేడ్ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు భారత్ కూడా చర్చలపై ఆసక్తి చూపుతున్నప్పటికీ, ట్రంప్ వ్యాఖ్యలపై అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు.
Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. మరొకరు అరెస్ట్
ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఉన్న వ్యాపార సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశముంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు పెరిగితే వాటి ధరలు పెరగడంతో భారతీయ వ్యాపారులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీని వల్ల ఎగుమతులు తగ్గే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రస్తుతం అమెరికా, భారత్ పరస్పరంగా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉండగా.. ఈ సుంకాల వివాదం సంబంధాలపై మేఘాలు కమ్మేలా చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.