- ఇండియా – పాక్ యుద్ధం జరగకుండా ఆపింది నేనే – ట్రంప్
- పాక్ ప్రధాని ప్రశంసలు
- తన ప్రమేయం వల్లే ఉద్రిక్తతలు తగ్గాయి
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వేదికలపై తన దౌత్యపరమైన విజయాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా భారత్ మరియు పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ, అప్పట్లో అణు యుద్ధం జరగకుండా తాను అడ్డుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన మధ్యవర్తిత్వం వల్లే ఆసియా ఖండంలో పెను విపత్తు తప్పిందని, తద్వారా సుమారు 10 మిలియన్ల (కోటి) మంది ప్రజల ప్రాణాలను కాపాడినట్లు ట్రంప్ వివరించారు. ఈ క్రమంలో నాటి పాకిస్థాన్ ప్రధాని కూడా తన చొరవను ప్రశంసించారని ఆయన పేర్కొన్నారు.
Donald Trump
భారత్-పాక్ మధ్య జరిగిన ఘర్షణల తీవ్రతను వివరిస్తూ, గతంలో పహల్గామ్ దాడి అనంతరం ఇరు దేశాల మధ్య గగనతల పోరు జరిగిందని, ఆ సమయంలో ఎనిమిది యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ గుర్తుచేశారు. అప్పట్లో పరిస్థితి అత్యంత భయానకంగా మారిందని, ఏ క్షణమైనా అణు బాంబుల దాడి జరిగే అవకాశం ఉన్నప్పటికీ, తాను ప్రమేయం చేసుకుని ఉద్రిక్తతలను తగ్గించానని చెప్పారు. ఇప్పటివరకు తాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనిమిది సంభావ్య యుద్ధాలను నిలిపివేసినట్లు ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
అయితే, తన హయాంలో మరియు ప్రస్తుత కాలంలో తాను పరిష్కరించలేకపోయిన ఏకైక యుద్ధం ఉక్రెయిన్-రష్యా యుద్ధమేనని ట్రంప్ అంగీకరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య తీవ్రమైన ద్వేషం నెలకొని ఉందని, అది ఈ సమస్య పరిష్కారానికి ప్రధాన అడ్డంకిగా మారిందని విశ్లేషించారు. ప్రపంచ శాంతి స్థాపనలో తన పాత్ర ఎంతో కీలకమని చెబుతూనే, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కాగా ట్రంప్ కామెంట్స్ పై భారతీయులు విమర్శలు చేస్తున్నారు. ప్రతి సారి ఇలా అబద్దం ఎందుకు చెపుతున్నావ్ ట్రంప్..యుద్ధం ఎందుకు ఆగిందో అందరికి తెలుసులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు .
