Trump Vs Kamala : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవాళ తెల్లవారుజామునే ప్రారంభమైంది. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ? అమెరికా అధ్యక్షులు ఎవరు అవుతారు ? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. డెమొక్రటిక్ పార్టీ తరఫున భారత సంతతి వనిత కమలా హ్యారిస్ పోటీ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ ఇద్దరు కూడా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నువ్వా.. నేనా అన్నట్టుగా పరస్పరం విమర్శలను సంధించుకున్నారు. ఆరోపణలను గుప్పించుకున్నారు.
Also Read :Aurobindo : ‘అరబిందో’ ఔట్.. 108, 104 సర్వీసుల నిర్వహణకు గుడ్‌బై ?
షరతులు వర్తిస్తాయి..
ఇంతకీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఎప్పుడు వస్తుంది ? వాస్తవానికి.. ఇవాళ రాత్రి పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలుపెడతారు. మన భారత దేశంతో(Trump Vs Kamala) పోలిస్తే అమెరికాలో జనాభా చాలా తక్కువ. అమెరికాలో 34 కోట్ల పైచిలుకు జనాభా ఉంది. దాదాపు 16 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మన భారత దేశంలో దాదాపు 96 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కలను బట్టి మనకు ఒక విషయం అర్థమైపోతుంది. అమెరికా ఎన్నికల పోలింగ్ ముగిశాక.. కొన్ని గంటల్లోనే ఫలితాల ట్రెండ్‌పై క్లారిటీ వస్తుంది. ఓట్ల లెక్కింపు మొదలైన 24 గంటల్లోగా ఫలితంపై ఫుల్ క్లారిటీ వస్తుంది. అయితే షరతులు వర్తిస్తాయి. స్వల్ప తేడాతో ఏవైనా అమెరికా రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు వస్తే.. వాటి విడుదలలో కొన్ని రోజుల జాప్యం జరిగే ఛాన్స్ ఉంది. ఓట్ల లెక్కింపు, రీకౌంటింగ్ వంటి అంశాలపై ఆయా అధ్యక్ష అభ్యర్థులు ఒకవేళ కోర్టులలో పిటిషన్లు వేస్తే.. ఎన్నికల ఫలితం రావడానికి వారానికిపైగా టైం పట్టొచ్చు. ఫలితం వన్ సైడ్‌గా, స్పష్టంగా ఉంటే.. ఓడిపోయిన వారు వెంటనే మీడియా ముందుకు వచ్చి తమ ఓటమిని అంగీకరించే అవకాశం ఉంటుంది. ఈసారి అమెరికా ఎన్నికల కౌంటింగ్ వేళ ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచిచూద్దాం.
కమల గెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం : ట్రంప్
ఇవాళ అమెరికా ఓటర్లను ఉద్దేశిస్తూ దేశ అధ్యక్షుడు జో బైడెన్ (డెమొక్రటిక్ పార్టీ), రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లు చేశారు. ఓటింగ్‌లో పెద్దఎత్తున పాల్గొనాలని ప్రజలకు వారు పిలుపునిచ్చారు. ట్రంప్‌ను కమలా హారిస్ ఓడిస్తుందని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కమలా హారిస్ అధికారంలోకి వస్తే పశ్చిమాసియా ఆక్రమణకు గురవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. కమల మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. శాంతి కోసం తనకే ఓటు వేయాలన్నారు.