Donald Trump : గవర్నమెంట్ సీక్రెట్ డాక్యుమెంట్లను ట్రంప్ దాచారా? కోర్టు సమన్లు
Pasha
Donald Trump
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ న్యాయ వివాదాల ఉచ్చు బిగుస్తోంది. నిన్నమొన్నటి దాకా లైంగిక వేధింపుల కేసులలో కోర్టు మెట్లు ఎక్కిన ఆయన .. ఇప్పుడు గవర్నమెంట్ సీక్రెట్ డాక్యుమెంట్లను తీసుకెళ్లి ఇంట్లో దాచిన కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ట్రంప్ కు మియామిలోని ఫెడరల్ కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే మంగళవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈవిషయాన్ని ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ట్రూత్ సోషల్ ‘ వేదికగా వెల్లడించారు. ఈ కేసు 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాలనే ట్రంప్ (Donald Trump) లక్ష్యానికి పెద్ద ఆటంకంగా మారొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మాన్హాటన్లో ఒక పోర్న్ స్టార్ కు డబ్బు చెల్లింపులు జరిపినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఏమిటీ కేసు .. ఏమిటా గవర్నమెంట్ సీక్రెట్ డాక్యుమెంట్లు ?
2021లో ఫ్లోరిడాలోని ట్రంప్ ఇంటిపై ఫెడరల్ బ్యూరో (ఎఫ్బీఐ) అధికారులు రైడ్స్ చేశారు. ఆ సందర్భంగా మొత్తం 15 బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని 14 బాక్సుల్లో అమెరికా ప్రభుత్వానికి చెందిన రహస్య డాక్యుమెంట్లు చాలా ఉన్నాయి. ఈ పత్రాల్లో కీలకమైన వాటిని ఆయన మ్యాగజైన్లు, డైలీలతో పాటు తన వ్యక్తిగత పత్రాల్లో కలిపేశారని ఎఫ్బీఐ తన అఫిడవిట్ లో పేర్కొంది. ఇది వాటిని దాచిపెట్టడమే అవుతుందని 32 పేజీల అఫిడవిట్ లో అభిప్రాయపడింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక.. వైట్ హౌస్ ను వీడి వెళ్లే ముందు ట్రంప్ ఇలాంటి రహస్య డాక్యుమెంట్లను తన ఇంటికి తీసుకువెళ్లినట్టు అధికారులు భావిస్తున్నారు. 2022 ఆగస్టు 8న కూడా ఎఫ్బీఐ అధికారులు ట్రంప్ నివాసంలో సోదాలు జరిపి 11 సెట్ల గవర్నమెంట్ సీక్రెట్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే తన నివాసంలో సోదాలు జరపడం, తన వ్యక్తిగత పత్రాలను స్వాధీనం చేసుకోవడం రాజకీయ కక్ష సాధింపు చర్యే అని ట్రంప్ వాదిస్తున్నారు. దీనిపై కోర్టుకెక్కుతానని ఆయన అంటున్నారు. డాక్యుమెంట్లను డీక్లాసిఫై చేసే అధికారం అప్పట్లో అధ్యక్షుడిగా తన క్లయింటుకు ఉందని, క్రిమినల్ శాంక్షన్ కి ఇది లోబడి లేదని ట్రంప్ తరఫు లాయర్ ఎవాన్ కార్కోరన్ వాదిస్తున్నారు.