Trump Orders: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ, పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించిన రికార్డులు త్వరలో బహిర్గతం చేయనున్నారు. ఈ రహస్య ఫైళ్లను బహిరంగం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Orders) ఆమోదించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం జాన్ ఎఫ్. కెన్నెడీ, రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించిన దస్త్రాలను విడుదల చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
ఓవల్ ఆఫీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తూ ట్రంప్.. ఇది చాలా పెద్ద విషయం. దీని కోసం చాలా మంది చాలా కాలంగా, సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని అన్నారు. మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ, అతని సోదరుడు రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ, మానవ హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించిన ఫైల్‌లు బహిరంగం చేస్తామని ట్రంప్ అన్నారు. దీనికి సంబంధించిన ఆర్డర్‌పై సంతకం చేస్తూ.. చాలా మంది ఏళ్లుగా, దశాబ్దాలుగా వీటి కోసం ఎదురుచూస్తున్నారని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
Also Read: Davos 2025: తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల రికార్డు స్థాయిలో పెట్టుబడులు!
జో బిడెన్ పరిపాలన సమయంలో విడుదల చేసిన 13,000 పత్రాలలో కొంత భాగంతో సహా JFK హత్యకు సంబంధించిన అనేక ఫైల్‌లు ఇప్పటికే బహిరంగపరచబడ్డాయి. అయితే చాలా పత్రాలు సవరించబడ్డాయి. జాప్యం లేకుండా ఈ హత్యలకు సంబంధించిన అన్ని రికార్డులను విడుదల చేయడం జాతీయ ప్రయోజనాల కోసం అని వైట్ హౌస్ తన ఆర్డర్‌లో పేర్కొంది.
1961లో అమెరికాకు 35వ అధ్యక్షుడిగా జాన్ ఎఫ్. కెన్నడీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాలకే మృతిచెందారు. నవంబర్ 22, 1963వ సంవత్సరంలో కెన్నడీ టెక్సాస్ పర్యటనలో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అతనిపై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఆ సమయంలోనే అతను ప్రాణాలు కోల్పోయారు. అప్పట్నుంచి కెన్నడీ హత్య ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
మార్టిన్ లూథర్ కింగ్ ఏప్రిల్ 1968లో టెన్నెస్సీలో కాల్చి చంపబడ్డాడు. ఇదే ఏడాది కాలిఫోర్నియాలో రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో కాలిఫోర్నియాలో జరిగిన డెమోక్రటిక్ ప్రైమరీలో రాబర్ట్ జూనియర్ గెలుపొందారు.