అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) భారత్‌కు వ్యతిరేకంగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు గాను, ఇప్పటికే విధించిన 25 శాతం సుంకాలతో పాటు, తాజాగా మరో 25 శాతం అదనపు సుంకం (Trump Tariffs) విధించారు. దీనితో భారత్‌పై మొత్తం సుంకాల భారం 50 శాతానికి చేరింది. ఈ నిర్ణయం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్త సుంకాల అమలు వివరాలు
ట్రంప్ విధించిన ఈ కొత్త 25 శాతం సుంకాలు ఉత్తర్వులు విడుదలైన 21 రోజుల తర్వాత, అంటే ఆగస్ట్ 27 నుంచి అమలులోకి వస్తాయి. అయితే, ఇప్పటికే నౌకల్లో లోడ్ అయిన లేదా మార్గమధ్యలో ఉన్న భారతీయ వస్తువులకు ఈ కొత్త సుంకాలు వర్తించవు. అలాగే, సెప్టెంబర్ 17 లోపు వినియోగించుకునే వస్తువులపైనా ఈ కొత్త టారిఫ్‌లు అమల్లో ఉండవని స్పష్టం చేశారు. భారత్ దీనికి ప్రతీకార సుంకాలు విధించడానికి ప్రయత్నిస్తే, ఈ టారిఫ్‌లను మరింత పెంచుతామని వైట్‌హౌస్ హెచ్చరించింది.
భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న ట్రంప్
ట్రంప్ ఈ సుంకాల పెంపు గురించి ముందుగానే భారత్‌ను హెచ్చరించారు. భారతదేశం అత్యధిక సుంకాలు విధించే దేశమని, అందుకే తమకు తక్కువ వాణిజ్యం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతు ఇస్తోందని, దీనిపై తాను అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఆయన మరో 25 శాతం అదనపు సుంకాలు విధించి తన వైఖరిని స్పష్టం చేశారు. ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ 50 శాతం సుంకాల భారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.