Site icon HashtagU Telugu

Trump Tariffs: ఆహార ఉత్పత్తులపై టారిఫ్‌లు తగ్గిస్తూ ట్రంప్ కీలక నిర్ణయం!

Trump Tariffs

Trump Tariffs

Trump Tariffs: అమెరికన్ ప్రజలకు ద్రవ్యోల్బణం (Trump Tariffs) నుంచి ఉపశమనం కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహార పదార్థాలపై విధించిన కొన్ని టారిఫ్‌లను తగ్గించారు. శుక్రవారం ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసి ఈ టారిఫ్‌లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. టారిఫ్‌ల కారణంగా ఆహార పదార్థాల ధరలు పెరిగాయని ఫిర్యాదు చేసిన ప్రజలకు దీని ద్వారా పెద్ద ఉపశమనం లభిస్తుందని ఆయన తెలిపారు. టారిఫ్‌లు తగ్గిన ఉత్పత్తులలో ముఖ్యంగా కాఫీ, టీ, సీజనల్ ఫ్రూట్స్, జ్యూస్, కోకో, సుగంధ ద్రవ్యాలు, అరటిపండ్లు, నారింజ, టొమాటోలు, మాంసం (మీట్), అవకాడో, కొబ్బరి, పైనాపిల్, ఎండు పండ్లు (డ్రై ఫ్రూట్స్) ఉన్నాయి.

తగ్గిన టారిఫ్‌లు నవంబర్ 13 నుంచే అమలు

తగ్గించిన టారిఫ్‌లు నవంబర్ 13 నుంచే అమలులోకి వచ్చాయి. అమెరికాలో ఉత్పత్తి కాని లేదా తక్కువగా ఉత్పత్తి అయ్యే వస్తువులపై ఈ టారిఫ్‌లు తగ్గించబడ్డాయి. రిపబ్లికన్ పార్టీ నాయకులు ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో ఓటమిని చవిచూసి.. డెమొక్రాట్‌లు ఘన విజయం సాధించిన నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ ఈ టారిఫ్‌లను తగ్గించే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతకుముందు వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించేందుకు అధ్యక్షుడు ట్రంప్ ఈక్వెడార్, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, అర్జెంటీనా వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నారు.

Also Read: Akhanda 2: ‘అఖండ 2’ సెన్సేషన్.. భారీ ధరకు నార్త్ ఇండియా హక్కులు!

బ్రెజిల్ లక్ష్యంగా టారిఫ్‌లు.. కాఫీ, బీఫ్ మార్కెట్‌పై ప్రభావం

అమెరికాలో పశువుల సంఖ్య తగ్గడం వల్ల బీఫ్ ధరలు ఆకాశాన్ని తాకాయి. బ్రెజిల్ బీఫ్‌ను ప్రధానంగా ఎగుమతి చేసే దేశం అయినప్పటికీ టారిఫ్‌ల కారణంగా అక్కడి నుంచి బీఫ్ దిగుమతి కాకపోవడంతో దేశీయ మార్కెట్‌లో ద్రవ్యోల్బణం పెరిగింది. 10 శాతం టారిఫ్ పూర్తిగా తొలగించబడినప్పటికీ బ్రెజిల్ నుండి దిగుమతి అయ్యే బీఫ్‌పై ఇంకా 40% అదనపు పెనాల్టీ టారిఫ్ విధించబడింది. కాఫీ దిగుమతులపై కూడా టారిఫ్‌ల ప్రభావం పడింది. ఈ సంవత్సరం ప్రారంభంలో బ్రెజిల్‌పై మొత్తం 50% టారిఫ్ విధించబడింది. దీంతో ఆగస్టు- అక్టోబర్ నెలల్లో బ్రెజిల్ నుంచి కాఫీ గింజల కొనుగోళ్లు తగ్గాయి.

అమెరికాకు ఆర్థిక నష్టం

అమెరికాలో కాఫీ ఉత్పత్తి దాదాపుగా లేదు. టారిఫ్‌ల కారణంగా సరఫరా తగ్గి, ధరలు పెరిగి, డిమాండ్ తగ్గుతుందని అమెరికన్ ఉత్పత్తిదారులు ఇదివరకే హెచ్చరించారు. కోకో, ఘనీభవించిన నారింజ రసం, సుగంధ ద్రవ్యాలు, గింజలు, ఎండు పండ్లు, ఎరువుల వంటి వాటిపై కూడా అధిక టారిఫ్‌లు విధించడంతో అమెరికా ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. టారిఫ్‌లను తగ్గించే ప్రస్తుత ఉత్తర్వు ఉపశమనం కల్పిస్తున్నప్పటికీ.. బ్రెజిల్‌ను లక్ష్యంగా చేసుకొని విధించిన అదనపు టారిఫ్‌లు బీఫ్, కాఫీ మార్కెట్‌ను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. దీని వలన చివరికి అమెరికానే నష్టపోవాల్సి వస్తుంది.

Exit mobile version