Death Penalty : మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనున్న తరుణంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పౌరులు, అధికారులను చంపే వలసదారులకు మరణశిక్ష విధించే బిల్లును తీసుకొస్తానని ట్రంప్ ప్రకటించారు. అమెరికా పౌరుల ప్రాణాలకు ఏదైనా జరిగితే వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. కొలరాడోలోని ఆరోరాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :US Vs Iran : ఇజ్రాయెల్‌పై దాడికి పర్యవసానం.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కొరడా
తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే నేషనల్ ఆపరేషన్ అరోరాను ప్రారంభిస్తానని ట్రంప్ వెల్లడించారు. వెనెజులా దేశానికి చెందిన ట్రెన్ డె అరగువా గ్యాంగ్ సభ్యులు శిథిలావస్థలో ఉన్న అనేక అరోరా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లను నియంత్రిస్తున్నారని ఆయన తెలిపారు. ఆ గ్యాంగ్ సభ్యులను ఏరిపారేస్తానన్నారు. అరోరా ఏరియాను, వెనెజులా గ్యాంగ్ స్వాధీనం చేసుకున్న ప్రతీ పట్టణాన్ని రక్షిస్తానని ట్రంప్ ప్రకటించారు. ట్రెన్ డె అరగువా గ్యాంగ్ సభ్యులను జైలులో పెడతానని తెలిపారు. అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతంలోకి మెక్సికో నుంచి అక్రమ వలసలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘మన అమెరికాను ప్రమాదకరమైన చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు. అందువల్లే ఆక్రమిత అమెరికా అని ప్రపంచవ్యాప్తంగా పిలుస్తున్నారు’’ అని ట్రంప్ (Death Penalty) చెప్పుకొచ్చారు.
Also Read :AR Rahman : కమలకు మద్దతుగా రెహమాన్.. ఓటర్లకు 30 నిమిషాల మ్యూజిక్ మెసేజ్
ఎన్నికల ప్రచారం సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతపై ఆయన ప్రచార సిబ్బంది ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ట్రంప్ సెక్యూరిటీ ఏర్పాట్ల కోసం తగినన్ని వాహనాలను కానీ, సిబ్బందిని కానీ కేటాయించకపోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ట్రంప్ ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గత రెండు నెలల వ్యవధిలో ట్రంప్‌పై రెండు సార్లు హత్యాయత్నాలు జరిగాయి. మొదటిసారి హత్యాయత్నంలో.. ట్రంప్ కొంచెంలో ప్రాణాలతో బయటపడ్డారు.