భారత ఫార్మా రంగాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్‌!

ప్రస్తుతానికి భారతీయ ఫార్మా ఎగుమతిదారులకు ఒక పెద్ద ఊరట లభించింది. జెనరిక్ మందులు, బయోసిమిలర్ ఉత్పత్తులను ఈ టారిఫ్ పరిధి నుండి మినహాయించారు.

Published By: HashtagU Telugu Desk
Trump Pharma Strike

Trump Pharma Strike

Trump Pharma Strike: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత ఫార్మా రంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా ప్రభుత్వంతో ధరల ఒప్పందం చేసుకోని లేదా తమ తయారీ కేంద్రాన్ని అమెరికాకు మార్చని పేటెంట్ మందులు, ముడి పదార్థాలపై 100% వరకు టారిఫ్ (దిగుమతి సుంకం) విధిస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. ‘ప్రపంచ ఫార్మసీ’గా పిలవబడే భారత్ ఈ నిర్ణయంతో నేరుగా ప్రభావితం కానుంది.

ట్రంప్ కొత్త నిబంధన ఏమిటి?

అమెరికాలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసే కంపెనీలు ప్రారంభంలో 20% టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది (ఇది 2030 నాటికి 100% కి పెరుగుతుంది). అయితే అమెరికాలో ఫ్యాక్టరీని పెట్టని లేదా వారి ధరల నిబంధనలకు అంగీకరించని కంపెనీలు నేరుగా 100% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. భారత్ ఇప్పటివరకు అమెరికాతో ‘రీషోరింగ్ అగ్రిమెంట్’ (ఉత్పత్తిని మార్చే ఒప్పందం) గానీ లేదా ‘మోస్ట్ ఫేవరెడ్ నేషన్’ (MFN) ధరల ఒప్పందం గానీ చేసుకోలేదు. అందుకే భారతీయ కంపెనీలు ఇప్పుడు అమెరికా నిఘా నీడలో ఉన్నాయి.

Also Read: ముంబైపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యం!

భారతీయ కంపెనీలకు ఉన్న ఊరట ఏమిటి?

ప్రస్తుతానికి భారతీయ ఫార్మా ఎగుమతిదారులకు ఒక పెద్ద ఊరట లభించింది. జెనరిక్ మందులు, బయోసిమిలర్ ఉత్పత్తులను ఈ టారిఫ్ పరిధి నుండి మినహాయించారు. ఏప్రిల్ 2న వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం జెనరిక్ మందులపై ఎటువంటి అదనపు సుంకం విధించబడదు. భారత మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 34% వాటా ఒక్క అమెరికాదే. ఆర్థిక సంవత్సరం 2025లో భారత్ అమెరికాకు 10.5 బిలియన్ డాలర్ల విలువైన మందులను ఎగుమతి చేసింది. ఇందులో అత్యధికంగా తక్కువ ధర కలిగిన జెనరిక్ మందులే ఉన్నాయి.

భవిష్యత్తులో పొంచి ఉన్న ముప్పు

ప్రస్తుతానికి జెనరిక్ మందులకు మినహాయింపు లభించినప్పటికీ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. రాబోయే ఒక్క ఏడాది పాటు జెనరిక్ మందుల దిగుమతుల స్థాయిని నిశితంగా పరిశీలిస్తామని అమెరికా వాణిజ్య కార్యదర్శి సంకేతాలు ఇచ్చారు. మందుల కోసం ఇతర దేశాలపై తన ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం. ఒకవేళ ఏడాది తర్వాత దిగుమతులు ఎక్కువగా ఉన్నాయని వారు భావిస్తే జెనరిక్ మందులపై కూడా వేటు పడే అవకాశం ఉంది.

అమెరికాలో పెద్ద ఎత్తున వ్యాపారం చేసే భారతీయ ఫార్మా కంపెనీలు ఇప్పుడు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది. తమ సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంతో పాటు, అమెరికా రెగ్యులేటరీ తనిఖీలకు కూడా సిద్ధంగా ఉండాలి.

  Last Updated: 04 Apr 2026, 08:01 PM IST