Pope Francis : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరు కీలక అభ్యర్థులపై క్రైస్తవ మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా అంశాలలో డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ), కమలా హ్యారిస్ (డెమొక్రటిక్ పార్టీ) ఇద్దరి వైఖరి కూడా సరిగ్గా లేదని ఆయన పేర్కొన్నారు. ‘‘డొనాల్డ్ ట్రంప్ వలస వ్యతిరేక విధానాలను అవలంభిస్తానని అంటున్నారు. కమలా హ్యారిస్ అబార్షన్ హక్కులకు మద్దతు పలుకుతున్నారు. మొత్తం మీద ఇద్దరు కూడా జీవించే హక్కుకు భంగం కలిగించే వైఖరిని కలిగి ఉన్నారు’’ అని పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) చెప్పారు.
Also Read :Hindi Diwas 2024: హిందీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..? ఈ రోజు ప్రాముఖ్యత ఇదే..!
12 రోజుల పాటు పలు ఆసియా దేశాలలో పర్యటించిన పోప్.. రోమ్‌కు తిరిగి బయలుదేరే క్రమంలో తన విమానంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘వలసదారులను విస్మరించడం అనే ట్రంప్ వైఖరి సరికాదు. ఈ భూమిమీద అందరికీ జీవించే హక్కు ఉంది’’ అని ఆయన తెలిపారు. ‘‘అబార్షన్ హక్కులను మహిళలకు కల్పిస్తే.. పుట్టబోయే పిల్లలను చంపిన వాళ్లు అవుతారు. ఇద్దరూ మానవ జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మార్చే ప్రయత్నాల్లోనే ఉన్నారు’’ అని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.
Also Read :Adani Group In TIME: ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్..!
‘‘నేను అమెరికన్‌ను కాదు.. అక్కడ ఓటు వేయను.. అయినా వలసదారులను అణచివేయాలనే ట్రంప్ వైఖరిని వ్యతిరేకించాల్సిన బాధ్యత నాపై ఉంది. వలసదారులకు అమెరికాలో అవకాశాలను తగ్గించాలని భావించడం పాపం’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే ఈ రేసులో డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున తొలుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేరును ప్రకటించారు. అయితే ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో ఆయన అంతగా రాణించలేకపోయారు. దీంతో బైడెన్ స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను బరిలోకి దింపారు.