Site icon HashtagU Telugu

Nobel Prize: భౌతికశాస్త్రంలో ముగ్గురుకి నోబెల్ బహుమతి

Nobel Imresizer

Nobel Imresizer

స్టాక్‌హోం: భౌతికశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారాలను రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ ఈరోజు ప్రకటించింది. ఫోటాన్లలో చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో చేసిన పరిశోధనలకు అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్. క్లాజర్, ఆంటోన్ జైలింగర్‌లకు ప్రపంచంలోనే ఈ అత్యున్నత పురస్కారం లభించింది. ఈ ముగ్గురు క్వాంటం స్థితులను ఉపయోగించి అద్వితీయమైన ప్రయోగాలు నిర్వహించారు. రెండు కణాలు విడిపోయినప్పుడు కూడా ఒకే యూనిట్‌గా ప్రవర్తిస్తాయి. ఈ పరిశోధన ఫలితాలు క్వాంటం సమాచారం ఆధారంగా సరికొత్త సాంకేతిక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్ర‌స్తుతం క్వాంట‌మ్ కంప్యూట‌ర్స్‌, క్వాంట‌మ్ నెట్‌వ‌ర్క్స్‌, సెక్యూర్ క్వాంట‌మ్ ఇన్‌క్రిప్టెడ్ క‌మ్యూనికేష‌న్‌లో విస్తృత స్థాయిలో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.
గతేడాది కూడా ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై విశ్లేషణలకు సుకురో మనాబే, క్లాస్ హలిస్‌మన్, జార్జియో పారిసీలకు సంయుక్తంగా నోబెల్ పురస్కారం లభించింది. అయితే, ఆ బహుమతి ముగ్గురికీ సమానంగా లభించలేదు. జార్జియో పారసీకి సగం బహుమతి, మిగిలిన సగాన్ని మనాబే, హలిస్‌మన్‌లు పంచుకున్నారు. ఈ ఏడాది మాత్రం ప‌ది మిలియ‌న్ల స్వీడిష్ క్రోన‌ర్ల‌ను ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు స‌మానంగా పంచుతారు. నోబెల్ బహుమతి ప్రకటనలు సోమవారం నుంచి ప్రారంభం కాగా, తొలి రోజు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని స్వాంటె పాబోకు ప్రకటించిన విషయం తెలిసిందే.

అలేన్ ఆస్పెక్ట్ 1947లో ఫ్రాన్స్‌లోని ఏజెన్‌లో జ‌న్మించారు. పారిస్‌లోని స‌డ్ యూనివ‌ర్సిటీ నుంచి 1983లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పారిస్‌-సాక్లే అండ్ ఈకోల్ పాల‌క్నిక్ కాలేజీలో ప్రొఫెస‌ర్‌గా చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ప‌స‌డేనాలో జాన్ ఎఫ్ క్లాజ‌ర్ 1942లో జ‌న్మించారు. న్యూయార్క్‌లోని కొలంబియా వ‌ర్సిటీ నుంచి 1969లో పీహెచ్‌డీ చేశారు. ప్ర‌స్తుతం రీస‌ర్చ్ ఫిజిస్ట్‌గా పరిశోధన చేస్తున్నారు. ఆంటోన్ జీలింగ‌ర్ ఆస్ట్రియాలోని రీడ్‌లో జ‌న్మించారు. వియ‌న్నా వ‌ర్సిటీలో 1971లో పీహెచ్‌డీ పూర్తి చేసి, ప్రొఫెస‌ర్‌గా చేశారు.