Site icon HashtagU Telugu

Pakistanis Deaths: 5 విమానాలను కూల్చేశాం.. చనిపోయింది 11 మందే.. మేమూ దాడి చేస్తాం : పాక్

Pakistanis Deaths India Strike On Pakistan Khawaja Muhammad Asif

Pakistanis Deaths: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరుతో మన సైన్యం మెరుపు ఎటాక్స్ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్(Pakistanis Deaths) పరిధిలోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను, వాటి మౌలిక సదుపాయాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. పూర్తి కచ్చితత్వంతో ఈ ఎటాక్స్ చేసింది. పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్‌ వెల్లడించింది. దాడుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని భారత రక్షణశాఖ ప్రకటించింది. అయితే ఈ దాడులపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ స్పందించారు. తమ దేశంపై భారత్ దాడి చేసిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. తమపై దాడికి భారత్ మిస్సైళ్లను వాడిందన్నారు. బుధవారం తెల్లవారుజామున పాక్ భూభాగంపై భారత్ దాడి జరిగిందని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ చెప్పారు. ‘‘పాకిస్తాన్‌లో భారత్ దాడి చేసిన ప్రదేశాలన్నీ ప్రజలు నివసించే ఏరియాలే. ముగ్గురు చనిపోయారని మాకు సమాచారం అందింది. చనిపోయిన వారిలో ఒక శిశువు కూడా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

Also Read :India – Pakistan War : భారత్‌ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలు ఇవే..

పాకిస్తాన్ ఆర్మీ కథనం మరోలా..

పాకిస్తాన్ ఆర్మీ సైనిక వర్గాల కథనం మరోలా ఉంది. ‘‘భారత్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు పాకిస్తాన్‌లో 11 మంది పౌరులు చనిపోయారు. 35 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి ఆచూకీ కనిపించడం లేదు. భారత సైన్యం మిస్సైళ్లతో పాకిస్తాన్‌పై దాడి చేసింది’’ అని పాక్ ఆర్మీ వర్గాలు అంతర్జాతీయ మీడియాకు తెలిపాయి. ‘‘పాకిస్తాన్‌లోని సైనిక శిబిరాలకు ఎలాంటి నష్టమూ జరగలేదు. జనావాసాలపైనే భారత్ దాడి చేసింది. ఆరు ప్రదేశాల్లో 24 సార్లు భారత్ దాడి చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి కానీ, యుద్ధ విమానాలకు కానీ ఎలాంటి నష్టమూ జరగలేదు. మా సైనికులు సాహసోపేతంగా వ్యవహరించి భారత్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేశారు. వాటిలో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు, 1 సుఖోయ్ ఎస్‌యూ-30, 1 మిగ్ -29 ఉన్నాయి’’  అని పాకిస్తాన్ సైనిక వర్గాలు చెప్పాయి.

Also Read :India – Pakistan War : పాక్ స్థావరాలపై భారత్ మెరుపు దాడులు – 30 మంది ఉగ్రవాదులు మృతి

ఐరాసకు పాక్ సమాచారం.. ప్రతిదాడి చేస్తామని వెల్లడి

భారత ఆర్మీ చేసిన దాడిపై వెంటనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పాకిస్తాన్ సమాచారాన్ని అందజేసింది. భారత్ చేసిన దాడికి, ప్రతిదాడి చేసే హక్కు తమకు ఉంటుందని తెలిపింది. ‘‘పాకిస్తాన్  సార్వభౌమత్వాన్ని భారత్ ధిక్కరిస్తోంది’’ అని పాక్ ఆరోపించింది. భారత్ మాత్రం.. ‘‘మేం కచ్చితమైన లక్ష్యాలపైనే దాడి చేశాం.. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. జనావాసాలపై కానీ, సైనిక స్థావరాలపై కానీ దాడులు చేయలేదు’’ అని స్పష్టం చేసింది.