Mediterranean Sea : మధ్యధరా సముద్రంలో వేల మంది గల్లంతు

తునీషియా నుంచి లిబియా నుంచి వేలాది సంఖ్యలో మధ్యధరా సముద్రాన్ని (Mediterranean Sea) దాటి యూరప్ చేరుకోవడానికి శరణార్థులు ప్రయత్నాలు చేస్తున్నారు

  • Written By:
  • Updated On - October 2, 2023 / 01:08 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Mediterranean Sea : మనకి మన చుట్టుపక్కల విషయాలు తప్ప ప్రపంచంలో కొంచెం దూరంగా జరుగుతున్న ఘటనలు అంత త్వరగా పట్టవు. అయితే ఈ వేగవంతమైన ఇంటర్నెట్ యుగంలో కన్నుంటే చూడాలే గాని కనపడని దృశ్యాలంటూ ఉండవు. అలా ఒక వార్త ఇటీవల నన్ను బాగా కలవర పరచింది. తునీషియా నుంచి లిబియా నుంచి వేలాది సంఖ్యలో మధ్యధరా సముద్రాన్ని (Mediterranean Sea) దాటి యూరప్ చేరుకోవడానికి శరణార్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ దేశాల నుంచి యూరప్ దేశాలకు వలస వచ్చిన వారి సంఖ్య ఈ సంవత్సరం రెండు వందల అరవై శాతం పెరిగిందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ అందించిన వివరాల ద్వారా తెలుస్తోంది.

కేవలం ఈ ఒక్క సంవత్సరంలో సెప్టెంబర్ వరకు దాదాపు లక్ష మంది పైగా మధ్యధరా సముద్రాన్ని (Mediterranean Sea) దాటి యూరప్ దేశాలకు వలస రావడానికి ప్రయత్నించారని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ వలసలు కారణాలు ఏమైనా, సముద్ర మార్గంలో యూరప్ దేశాలకు చేరుకోవాలనుకుంటున్న వారు వేల సంఖ్యలో చనిపోవడమో.. సముద్రంలో గల్లంతైపోవడమో జరుగుతుంది. ఇదే ప్రపంచాన్ని కలవరపరుస్తున్న విషయం ఇప్పుడు.

We’re on WhatsApp. Click to Join.

ఈ సంవత్సరం ఇప్పటి వరకు 2500 మంది శరణార్థులు మధ్యధరా సముద్రంలో (Mediterranean Sea) మునిగిపోయి చనిపోవడమో లేక సముద్రంలో గల్లంతయిపోవడమో జరిగిందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ యుఎన్ హెచ్ సి ఆర్ తెలియజేసింది. గత సంవత్సరం ఈ సంఖ్య 1,680 ఉంటే అది ఇప్పుడు 2500 దాటింది. ప్రజలు ప్రాణాలకు తెగించి రోడ్డు మార్గంలోను, సముద్ర మార్గంలోనూ ప్రయాణిస్తున్నారని ఈ ఏజెన్సీ డైరెక్టర్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఒక నివేదికలో తెలియజేశారు. యూరోపియన్ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది ఈ విషయం. ఈ మధ్య బ్రస్సెల్స్ లో జరిగిన యూరోపియన్ యూనియన్ ఇంటీరియర్ మినిస్టర్స్ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 1,86,000 మంది యూరోప్ దేశాలకు తరలివచ్చారు. వీరిలో 1,30,000 మంది ఇటలీకి వచ్చినట్టు తెలుస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 83% ఎక్కువగా భావిస్తున్నారు.

ఇతరులు గ్రీస్, స్పెయిన్, సైప్రస్ మాల్టస్ దేశాలకు తరలి వెళ్లారు. వీరిలో లక్ష మందికి పైగా తునీషియా నుంచి వలస పోయినట్టు, 45 వేలమంది లిబియా నుంచి వెళ్ళినట్టు లెక్కలు చెబుతున్నాయి. మధ్యధరా సముద్రంలో (Mediterranean Sea) చనిపోయిన వారు గల్లంతయిన వారు మినహాయిస్తే మృత్యుముఖం నుంచి బయటపడిన వారు 31 వేల మంది ఉంటారని వీళ్లంతా తునీషియా నుంచి వలస వెళ్తున్న వాళ్లని, లిబియా నుంచి వలస వెళ్లే వారిలో పదివేల ఆరు వందల మందిని ప్రాణాపాయం నుంచి కాపాడినట్టు సమితి ఏజెన్సీ చెప్తుంది. ఈ లెక్కలన్నీ కేవలం సముద్ర మార్గంలో ఆ దేశాల నుంచి బయలుదేరి వేరే ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారి విషయం మాత్రమే. ఇక రోడ్డు మార్గంలో వెళ్లేవారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎంతమంది చనిపోతున్నారో వివరాలు తెలియవని ఏజెన్సీ పేర్కొంది.

Also Read:  Pawan Kalyan: మహాత్మా గాంధీజీ బాట సర్వదా అనుసరణీయం: పవన్ కళ్యాణ్

కారణాలు ఏమైనాప్పటికీ మధ్యధరా సముద్రాన్ని దాటి వలస పోవడానికి తునీషియా, లిబియా దేశాల ప్రజలు ప్రాణాలు సైతం లెక్కచేయడం లేదు. మామూలు చేపలు పట్టే చిన్నపాటి ఓడ లాంటి వాటిలో వేలమంది క్రిక్కిరిసి ప్రయాణం చేయడం, ఆ పడవ మునిగిపోతే బతికిన వాళ్ళు బయటపడడం, అసహాయులు చనిపోవడం జరుగుతుంది. నాగరికతలో అత్యాధునిక దశకు చేరుకున్నామని, చంద్రుడిపై మకాం పెడుతున్నామని, ఇతర గోళాలను సైతం అన్వేషిస్తున్నామని, అంతరిక్షంలో ఎక్కడికైనా ప్రయాణం చేయగలమని అన్ని దేశాలూ గొప్పలు చెప్పుకుంటున్న ఈ కాలంలో, ఆకలితో పొట్ట పట్టుకుని ఖండాలు దాటి మృత్యుకోరలకు చిక్కుకుంటున్న ఈ వేలాది మంది అభాగ్యుల జీవితాల గురించి ఎలా అర్థం చేసుకోవాలి? వెలుగులోకి వస్తున్న వార్తలు చాలా తక్కువ.

ప్రపంచానికి తెలియకుండా చీకటిలోనే మునిగిపోతున్న లక్షలాది నిస్సహాయ జీవితాలు ఎన్నో తెలియదు. తునీషియా,లిబియా నుంచి తమ దేశాలకు వలస రాకుండా ఆపాలని ఇటలీ జర్మనీ లాంటి దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి గాని వలస పోవాల్సిన బతుకులకు భరోసానిచ్చే ప్రయత్నాలు ఎవరూ చేయడం లేదు. ఐక్యరాజ్యసమితి ఈ విషయంలో చేయాల్సిన మానవీయ కసరత్తు చాలా ఉంది. ఎవరి సరిహద్దులు వారు గీసుకుని, ఎవరి బాగోగులు వారు చూసుకుంటే కాదు. మొత్తం భూగోళమంతా ఒక కుటుంబంలా భావించి ఎక్కడి నుంచి ఎక్కడికో పొట్ట పట్టుకుని వలస పోయే కాలానికి స్వస్తి పలికే ప్రణాళికలతో ముందుకు కదలాలి. అప్పుడే ఇలాంటి విషాదకర వార్తలు మన చెవిని సోకవు.

Also Read:  Nara Bhuvaneswari : “స‌త్య‌మేవ‌ జ‌య‌తే”.. రాజ‌మండ్రిలో దీక్ష చేప‌ట్టిన నారా భువ‌నేశ్వ‌రి