లండన్ : ఇవాళ (మే 6) కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుకకు (King Charles III coronation) రంగం సిద్ధమైంది. అట్టహాసంగా జరగనున్న ఈ స్పెషల్ ఈవెంట్ లో భారత్ నుంచి 2,200 మంది హాజరవుతున్నారు. వారంతా ఇప్పటికే లండన్ కు చేరుకున్నారు. బ్రిటన్ రాజ కుటుంబం, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న ప్రముఖుల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖర్ ఉన్నారు. అయితే పలు కారణాలతో ఆమె అక్కడికి వెళ్లలేకపోతున్నారు. దీంతో ఇవాళ లండన్ లోని వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో జరిగే పట్టాభిషేక వేడుకలో(King Charles III coronation) మన దేశం తరఫున వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న ప్రముఖ ఇండియన్స్ లిస్ట్ ను ఒకసారి చూద్దాం..
* జగదీప్ ధంఖర్
ఈ వేడుకలో భారతదేశం తరపున వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖర్ పాల్గొంటారు. 1953లో క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేక వేడుకకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హాజరయ్యారు. బ్రిటన్ లో మళ్ళీ ఏడు దశాబ్దాల తర్వాత జరుగుతున్న పట్టాభిషేక వేడుక ఇది.
* సోనమ్ కపూర్
కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుక (King Charles III coronation ) సందర్భంగా నిర్వహించే కన్సర్ట్ కు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ హాజరుకానున్నారు. ఈసందర్భంగా ఆమె హోస్ట్ గా వ్యహరించనున్నారు. విండ్సర్ కాజిల్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ ఇంగ్లిష్ సింగర్ స్టీవ్ విన్‌వుడ్‌ని, కామన్వెల్త్ వర్చువల్ గాయక బృందాన్ని ఆమె సభికులకు పరిచయం చేస్తారు.
* అక్షతా మూర్తి
ఈ వేడుకకు హాజరయ్యేవారిలో యూకే ప్రధానమంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి కూడా ఉన్నారు. ఆమె ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి కుమార్తె. పట్టాభిషేక వేడుకలో దేశ జాతీయ జెండాను మోసుకెళ్లే ఊరేగింపునకు యూకే ప్రధానమంత్రి రిషి సునక్, భార్య అక్షత నాయకత్వం వహిస్తారు.
* ఇద్దరు ముంబై డబ్బావాలాలు
ముంబై మెట్రోపాలిటన్ నగరం యొక్క ప్రపంచ ప్రఖ్యాత లంచ్‌బాక్స్ డెలివరీ సిస్టమ్.. ముంబై డబ్బావాలాలు!! ఇద్దరు ముంబై డబ్బావాలాలకు కూడా కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ఆహ్వానం వచ్చింది. వీళ్ళలో ఒకరు ‘పునేరి పగడి’ (పూణే తలపాగా) ను, మరొకరు వార్కారీ సంఘం తయారు చేసిన శాలువను కింగ్ చార్లెస్ కు బహుమతిగా ఇస్తారు.చార్లెస్ 2003లో భారతదేశ పర్యటన సందర్భంగా ముంబై డబ్బావాలాలను కలిశారు. కెమిల్లా పార్కర్ బౌల్స్‌తో తన పెళ్ళికి కూడా డబ్బావాలాలను చార్లెస్ ఆహ్వానించారు.
also read : Charles III Coronation: కాబోయే బ్రిటన్ రాజు ఛార్లెస్-3 గురించి A టు Z
* లార్డ్ ఇంద్రజిత్ సింగ్, లార్డ్ సయ్యద్ కమల్
ఈ వేడుకలో లార్డ్ ఇంద్రజిత్ సింగ్ సిక్కు మతానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇండో-గయానీస్ సంతతికి చెందిన లార్డ్ సయ్యద్ కమల్ ముస్లిం మతానికి ప్రాతినిధ్యం వహిస్తారు.
* సౌరభ్ ఫడ్కే
పట్టాభిషేకానికి హాజరయ్యే వారిలో పూణేలో జన్మించిన ఆర్కిటెక్ట్ , ఉపాధ్యాయుడు సౌరభ్ ఫడ్కే కూడా ఉన్నారు. ఫడ్కే కింగ్ చార్లెస్ స్వచ్ఛంద సంస్థతో అనుబంధం కలిగి ఉన్నారు. ది ప్రిన్స్ ఫౌండేషన్ యొక్క బిల్డింగ్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్, ది ప్రిన్స్ ఫౌండేషన్ స్కూల్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ట్స్‌లో ఆయన గ్రాడ్యుయేషన్ కోర్సు చేశారు.
*గుల్ఫ్షా
2022లో ది ప్రిన్స్ ట్రస్ట్ గ్లోబల్ అవార్డును అందుకున్న భారతీయుడు గుల్ఫ్షా కూడా ఈ పట్టాభిషేక వేడుకలో పాల్గొంటారు. గుల్ఫ్షా కు ది ప్రిన్స్ ట్రస్ట్ గ్లోబల్ అవార్డును ది ప్రిన్స్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ పార్టనర్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా అందించాయి.
* జై పటేల్
2022 మేలో ప్రిన్స్ ట్రస్ట్ కెనడా యొక్క యూత్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఇండో-కెనడియన్ జై పటేల్. ఈయన కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి హాజరుకావడానికి ఆహ్వానం అందుకున్నారు.
* మంజు మల్హి
మంజు మల్హి.. UKలోని సీనియర్ సిటిజన్స్ ఛారిటీతో పని చేస్తున్న భారతీయ సంతతికి చెందిన చెఫ్. ఈమె పట్టాభిషేక వేడుకకు ఆహ్వానం అందుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్ (BEM) విజేతలలోఈమె ఒకరు. కరోనా టైం లో లండన్‌లోని కమ్యూనిటీకి చేసిన సేవలకు గాను మల్హికి BEM మెడల్ వచ్చింది. మే 6న వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో జరిగే వేడుకలో 850 మంది BEM గ్రహీతలు కూడా పాల్గొంటున్నారు. 2016 నుంచి ఛారిటీ ఓపెన్ ఏజ్ కోసం రెసిడెంట్ చెఫ్‌గా ఉన్న మల్హి.. ఆమె చేసిన సేవలకు ఎంతో గౌరవం పొందింది.