మిన్నియాపాలిస్‌లో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో ఇద్దరు నిరసనకారులు మరణించడంపై డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో బడ్జెట్ చర్చలు నిలిచిపోయాయి. ఈ ఘటన కారణంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి (డీహెచ్‌ఎస్) నిధుల కేటాయింపుపై ప్రతిష్ఠంభన ఏర్పడి, షట్‌డౌన్‌కు దారితీసింది. ఒప్పందం కుదరకపోవడంతో విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, రక్షణ వంటి పలు కీలక శాఖల్లో అత్యవసరం కాని కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఈ షట్‌డౌన్ కొనసాగితే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు వేతనం లేకుండా పనిచేయాల్సి రావచ్చు లేదా వేతనం లేని సెలవుపై వెళ్లాల్సి ఉంటుంది. “డ్రగ్ స్మగ్లర్లు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడేవారు, అక్రమ రవాణాదారులను వదిలేసి.. ట్రంప్ ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై తమ వనరులను వృథా చేస్తోంది” అని సెనేట్ డెమోక్రాటిక్ మైనారిటీ విప్ డిక్ డర్బిన్ విమర్శించారు.
ఇప్పటికే సెనేట్ కీలకమైన ఐదు ఫండింగ్ బిల్లులను ఆమోదించింది. డీహెచ్‌ఎస్‌పై చర్చలకు మరింత సమయం ఇచ్చేందుకు రెండు వారాల తాత్కాలిక నిధుల ప్యాకేజీని కూడా ఆమోదించింది. ఈ ఒప్పందానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారు. త్వరగా చర్యలు తీసుకోవాలని హౌస్‌ను కోరారు. గత శరదృతువులో నెల రోజులకు పైగా షట్‌డౌన్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇది రెండో షట్‌డౌన్.
