American Visa: అమెరికా పౌరసత్వానికి ఈబీ – 5 వీసా..!

అమెరికా పౌరసత్వం పొందడానికి బంగారుబాట ఈబీ-5 వీసా (EB-5 Visa). దీనిని గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు.

అమెరికా పౌరసత్వం పొందడానికి బంగారుబాట ఈబీ-5 వీసా (EB-5 Visa). దీనిని గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు. సంపన్న దరఖాస్తుదారులను ఇది గొప్పగా ఆకర్షిస్తోంది. అయితే ఈ వీసా కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో ఆర్థిక అక్రమాలు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వీసా దరఖాస్తుల క్లియరెన్స్ నత్తనడకన సాగుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌సీఆర్ కేపిటల్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సురేశ్ రాజన్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అత్యంత విలువైన సమాచారాన్ని వెల్లడించారు.

ఈబీ-5 (EB-5) వీసా అనేది ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ వీసాలలో ప్రత్యేకమైనదని చెప్పారు. దీనికి, హెచ్1-బీ వీసాకు చాలా తేడా ఉందన్నారు. అమెరికాలో ఇమిగ్రెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆధారంగా ఈబీ-5 వీసాను జారీ చేస్తారన్నారు. ఇది అమెరికా ఫెడరల్ ప్రోగ్రామ్ అని తెలిపారు. అమెరికాలో వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టేవిధంగా ఇతర దేశాలవారిని ప్రోత్సహించడం కోసం దీనిని 1990వ దశకంలో రూపొందించారని చెప్పారు. విదేశీ పెట్టుబడుల ద్వారా అమెరికాలో ఉద్యోగాలను సృష్టించడం దీని లక్ష్యమని చెప్పారు. పెట్టుబడులు పెట్టినవారు, అందుకు ప్రతిఫలంగా తమ కుటుంబ సభ్యులకు కూడా గ్రీన్ కార్డులను పొందవచ్చునన్నారు. అవివాహితులైన 21 సంవత్సరాల లోపు వయసుగల పిల్లలకు కూడా ఈ విధంగా గ్రీన్ కార్డ్ పొందవచ్చునని చెప్పారు. గతంలో కనీసం 5 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టవలసి ఉంటుందనే నిబంధన ఉండేదని, ఇప్పుడు దీనిని 8 లక్షల డాలర్లకు పెంచినట్లు చెప్పారు. ఈ పెట్టుబడితో అమెరికాలో కొన్నేళ్ళపాటు కనీసం 10 ఉద్యోగాలను సృష్టించవలసి ఉంటుందన్నారు. అమెరికాలోని ఇమిగ్రెంట్స్‌కు ఈ వీసా పథకం బాగా ఉపయోగపడుతుందన్నారు.

ఇతర వీసాలతో పోల్చుకుంటే, ఈబీ-5 ప్రోగ్రామ్ చాలా విస్తృత అవకాశాలను ఇస్తుందన్నారు. గ్రీన్ కార్డు సంపాదించడానికి, ఆ తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి వేగంగా, నేరుగా బాటలు పరుస్తుందని చెప్పారు. ఈబీ-5 వీసా ప్రోగ్రామ్ 1990వ దశకంలో ప్రారంభమైనప్పటికీ, 2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తే వరకు దీని పట్ల పెద్దగా ఎవరూ ఆకర్షితులు కాలేదన్నారు. డెవలపర్స్ ఆర్థిక వనరులను పొందడానికి ఈ ప్రోగ్రామ్ అవకాశం కల్పించిందన్నారు. విదేశాలలోని సంపన్న ఈబీ-5 పార్టిసిపెంట్స్ నుంచి డెవలపర్స్ నిధులను పొందగలిగారని తెలిపారు. సంక్షోభ సమయాల్లో ఇది మంచి ప్రయోజనాలను ఇచ్చిందన్నారు. గతంలో రుణదాత, రుణ గ్రహీత ఒకే సంస్థ నియంత్రణలో ఉండేవారన్నారు. మదుపరుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించేవారు మదుపరుల తరపున ఎవరూ ఉండేవారు కాదని తెలిపారు.

ఈబీ-5 వీసా ప్రోగ్రామ్‌పై వస్తున్న విమర్శల గురించి సురేశ్ మాట్లాడుతూ, ఈబీ-5 అనేది కేపిటల్ మార్కెట్ అని, సరైన నియంత్రణ లేకపోతే, ప్రతి కేపిటల్ మార్కెట్లోనూ కొంత వరకు మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పారు. అయితే ఈబీ-5 రిఫార్మ్ అండ్ ఇంటెగ్రిటీ యాక్ట్ ద్వారా 2022లో దీనిని రెన్యూ చేశారని తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడిదారులకు చాలా అనుకూలంగా మారిందన్నారు. ఈ ఇండస్ట్రీ పార్టిసిపెంట్స్ అందరిలో ఇప్పుడు గొప్ప పారదర్శకత ఉందన్నారు.