Baby Born during Earthquake: భూకంప శిథిలాల కిందే ఆ పాప జననం..

టర్కి(Turkey), సిరియా(Syria)లో ప్రకృతి ప్రకోపానికి ఆర్తనాదాలు ఆగడం లేదు.

టర్కి (Turkey), సిరియా (Syria) లో ప్రకృతి ప్రకోపానికి ఆర్తనాదాలు ఆగడం లేదు. పేకమేడల్లా కూలిన భవనాల కింద మెలిపెట్టే కథనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అలా కూలిన ఓ భవనం కిందే భూమ్మీదకు అడుగుపెట్టింది అయా (Aya). ఈ భూప్రళయం (Earthquake) లో తల్లిదండ్రులు, తోబుట్టువుల ఆయువు గాల్లో కలవగా.. ఈ పాప (Baby) కొత్త ఊపిరి పోసుకుంది. ఆ పసికందు చిత్రాలు వైరల్‌గా మారడంతో.. తనను దత్తత చేసుకునేందుకు వేలాది మంది ముందుకు రావడం విశేషం.

టర్కి (Turkey) సిరియా (Syria) లో సోమవారం తెల్లవారుజామున వచ్చిన భూకంప తీవ్రతకు నిద్రలోనే ఎన్నో ప్రాణాలు పోయాయి. అలా సిరియాలోని జిండిరెస్‌ ప్రాంతంలో ఓ నిండు గర్భిణి తన కుటుంబంతో పాటే చిక్కుకుపోయింది. అప్పుడే ఆమె కడుపులో ఉన్న బిడ్డ కోసం తీవ్ర ఆవేదన చెందింది. ఆ ఉలిక్కిపాటుతో ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. చావు అంచుల్లోనూ ప్రసవ వేదన భరిస్తూ.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ అప్పటికే సత్తువ కోల్పోయి, ప్రాణాలు విడిచింది. భూకంపం వచ్చిన దాదాపు పది గంటల తర్వాత శిథిలాల కింద పాప (Baby) ఏడుపు శబ్దం విన్న సహాయక సిబ్బందికి తల్లిపక్కనే బొడ్డుతాడుతో ఉన్న పసికందు కనిపించింది. తల్లిని కదిలిస్తే.. అచేతనంగా ఉంది. దాంతో వారు ఒక్క ఉదుటున ఆ పసికందును రక్షించి, ఆసుపత్రికి చేర్చారు.

ఏడుపు వినిపించగానే.. మొదట ఒక వ్యక్తి వేగంగా పరిగెత్తి మట్టిలో ఉన్న చిన్నారిని చేతుల్లోకి తీసుకున్నాడు. గడ్డకట్టే చలిలో ఇంకొకరు తనని దుప్పటిలోకి తీసుకోగా.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు మరొకరు అంతే వేగంగా వాహనం తీసుకువచ్చారు. శ్వాస కూడా తీసుకోలేని స్థితిలో, గాయాలతో ఆసుపత్రికి చేరింది. అయితే ఇప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. వారే ఆ బిడ్డకు అయా అని పేరుపెట్టారు. ఆ పేరుకు అర్థం ‘అద్భుతం’ అని. అవును.. ఆ బిడ్డ జననం చూస్తుంటే అదే అనిపిస్తోంది మరి. ఇప్పటికే ఇల్లు కోల్పోయిన ఆమె బంధువుల కుటుంబం.. ఆ చిన్నారిని చూసుకునేందుకు ముందుకు వచ్చింది. వీరే కాకుండా ఇంకా ఎంతోమంది ఆ పాపను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. చికిత్స అందిస్తోన్న ఓ వైద్యుడి భార్య ఆ శిశువుకు పాలు పట్టి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ దేశాల్లో నిర్వహిస్తోన్న సహయకచర్యలకు.. విపరీతంగా కురుస్తున్న మంచు, వరుసగా వస్తున్న ప్రకంపనలు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. మరోవైపు భూకంప సహాయక చర్యల్లో అత్యంత కీలకమైన 72 గంటలు కూడా ముగియడంతో.. శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడుతారన్న ఆశలు క్షణక్షణానికి సన్నగిల్లుతున్నాయి. అలాగే అయా మాదిరిగానే ఎంతో మంది చిన్నారులు అయిన వారిని పోగొట్టుకొని అనాథలుగా మారిపోయారు. భూకంప(Earthquake) మృతుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 21 వేల మరణాలు నమోదుకాగా.. వీరిలో సిరియాలో 3 వేల మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

Also Read:  Yahoo! Layoff: యాహూ లో 20% ఉద్యోగుల ఉద్వాసన!