దక్షిణ ఇరాన్ లో ముష్కరులు రెచ్చిపోయారు. హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో మొత్తం 9మంది మరణించారు. మోటార్ బైక్ లపై వచ్చిన దుండగులు ఒక మహిళ, ఇద్దరు చిన్నారులతోపాటు మొత్తం 9మందిని కాల్చిచంపినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఇజేలో నిరసనకారులు, భద్రతదళాలపై బుధవారం జరిగిన మొదటి దాడి తర్వాత ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. మిగతావారి కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు ప్రావిన్స్ లోని సీనియర్ అధికారి తెలిపారు. ఈ దాడి జరిగిన నాలుగు గంటల తర్వాత ఇరాన్ లోని అతి పెద్ద నగరమైన ఇస్పాహాన్ లో మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు పారమిలటరీ సభ్యులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా మరో ఇద్దరు గాయపడినట్లు ఫార్స్ వార్త సంస్థ తెలిపింది.
సెప్టెంబర్ 16న మహ్సా అమినీ కస్టడీలో మరణించినందుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్ శాంతి కరువైంది. నిత్యం ఏదొక ప్రాంతంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.