Temple in Australia: ఆస్ట్రేలియాలో హిందూ ఆలయంపై దాడి.. వారంలో ఇది రెండో ఘటన

ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి ఆస్ట్రేలియా (Australia)లోని హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేశారు. ఖలిస్తానీ మద్దతుదారులు ఇక్కడి విక్టోరియా రాష్ట్రంలోని ఆలయాన్ని ధ్వంసం చేశారు. విక్టోరియాలోని కారమ్ డౌన్స్‌లో గల శ్రీవిష్ణు దేవాలయంపై ఖలిస్తానీ ఉద్యమ మద్దతుదారులు దాడి చేశారు.

  • Written By:
  • Publish Date - January 18, 2023 / 06:15 AM IST

ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి ఆస్ట్రేలియా (Australia)లోని హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేశారు. ఖలిస్తానీ మద్దతుదారులు ఇక్కడి విక్టోరియా రాష్ట్రంలోని ఆలయాన్ని ధ్వంసం చేశారు. విక్టోరియాలోని కారమ్ డౌన్స్‌లో గల శ్రీవిష్ణు దేవాలయంపై ఖలిస్తానీ ఉద్యమ మద్దతుదారులు దాడి చేశారు. దీంతోపాటు ఆలయ గోడలపై భారత్‌కు వ్యతిరేకంగా పిచ్చి రాతలు రాశారు. దీనిపై స్పందించిన అక్కడి ఎంపీ బ్రాడ్ బట్టిన్ నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు. కాగా ఏడు రోజుల క్రితం కూడా ఓ హిందూ ఆలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. అక్కడి స్థానిక మీడియా కథనాల ప్రకారం.. విక్టోరియాలోని క్యారమ్ డౌన్స్‌లోని చారిత్రాత్మక శ్రీ శివ విష్ణు దేవాలయం సోమవారం ధ్వంసమైంది. తమిళ హిందూ సమాజం జరుపుకునే మూడు రోజుల ‘తై పొంగల్’ పండుగ సందర్భంగా భక్తులు దర్శనానికి వెళ్లినప్పుడు ఖలిస్తానీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు.

శ్రీ శివ విష్ణు ఆలయంలో చిరకాల భక్తురాలు ఉషా సెంథిల్నాథన్ ఈ ఘటనను ఖండించారు. తాను ఆస్ట్రేలియాలోని తమిళ మైనారిటీ గ్రూపు నుంచి వచ్చానని ఉష చెప్పింది. మతపరమైన హింస నుండి తప్పించుకోవడానికి మనలో చాలా మంది శరణార్థులుగా ఇక్కడికి వచ్చారని వివరించారు. ఆలయంలో జరిగిన ఘటనపై మాట్లాడుతూ.. ఇది నా ప్రార్థనా స్థలం. ఈ ఖలిస్తాన్ మద్దతుదారులు ఎలాంటి భయం లేకుండా తమ విద్వేషపూరిత సందేశాలతో దానిని విచ్ఛిన్నం చేయడం నాకు ఆమోదయోగ్యం కాదు అని అన్నారు.

Also Read: Corona Effected: కరోనా బారినపడిన పురుషులకు ఒక బ్యాడ్ న్యూస్!

ఆలయంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను ప్రీమియర్ డాన్ ఆండ్రూస్‌ను, విక్టోరియా పోలీసులను డిమాండ్ చేశానని ఉషా సెంథిల్‌నాథన్ అన్నారు. విక్టోరియా హిందూ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నివేదికల ప్రకారం.. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా విక్టోరియా చాప్టర్ అధ్యక్షుడు మకరంద్ భగవత్ కూడా దీనిపై స్పందించారు. మన దేవాలయాల విధ్వంసం ఖండించదగినది. విస్తృత సమాజం దీనిని సహించకూడదు అన్నారాయన.

అదే సమయంలో మెల్‌బోర్న్ హిందూ సమాజానికి చెందిన సచిన్ మహ్తే ఖలిస్తాన్ మద్దతుదారులకు సవాలు విసిరారు. ఈ ఖలిస్తాన్ మద్దతుదారులకు దమ్ముంటే విక్టోరియా పార్లమెంట్ హౌస్‌పై శాంతియుత హిందూ వర్గాల మత స్థలాలను లక్ష్యంగా చేసుకునే బదులు భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక చిత్రాలను వేయాలని ఆయన అన్నారు. ఈ ఘటనను విక్టోరియన్ లిబరల్ పార్టీ ఎంపీ బ్రాడ్ బాటిన్ కూడా విమర్శించారు. ఎలాంటి ద్వేషంతో మన భవిష్యత్తును నిర్మించుకోలేమని అన్నారు. ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు జనవరి 12న మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ ఆలయంపై సంఘ వ్యతిరేకులు దాడి చేశారు. అప్పుడు కూడా ఆలయంపై భారత వ్యతిరేక చిత్రాలను వేశారు. ఆలయ పాలకమండలి BAPS స్వామినారాయణ్ సంస్థ ఆస్ట్రేలియా ఈ ఘటనను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.